ఆదివాసులు అడవితల్లి ముద్దుబిడ్డలు. క్రీ.శ.1240-1750 మధ్యకాలంలో గొండ్వానా రాజ్యాలను ఏలిన వారు నేడు పాలకుల నిర్లక్ష్యానికి గురవుతున్నారు. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో సుమారు 40 కోట్ల ఆదివాసీ జనాభా ఉంది. భిన్న సంప్రదాయాలు, సంస్కృతులు, పర్యావరణహిత జీవన శైలి వీరి సొంతం. అడవుల్లోని ప్రకృతి వనరులే జీవనాధారం. 2011 జనాభా లెక్కల ప్రకారం భిన్న తెగలకు చెందిన 10.4 కోట్లమంది ఆదివాసులు భారత్లో నివసిస్తున్నారు. దేశంలోని 90 జిల్లాల్లో విస్తరించి ఉన్న వీరి జనాభా 2021 నాటికి 12 కోట్లు దాటవచ్చు. ఈశాన్య రాష్ట్రాల్లో అధిక జనాభా కేంద్రీకృతమై ఉంది.
ప్రభుత్వ శాఖల్లో అవినీతి వల్ల వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వీరికి అందడం లేదు. పౌష్టికాహార లేమి ఫలితంగా మాతా శిశుమరణాలు చోటుచేసుకుంటున్నాయి. పలువురు రక్తహీనతతో బాధపడుతున్నారు. సరైన వైద్య సదుపాయాలు లేక మలేరియా వంటి జబ్బులతో ఏటా అనేకమంది మరణిస్తున్నారు. గిరిజనులు నివసించే ప్రాంతాల్లో రహదారులు, విద్యుత్తు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులు కొరవడుతున్నాయి. సరైన రహదారులు లేక అత్యవసర సమయాల్లో రోగులను డోలీల్లో మోసుకెళ్తున్నారు. ఇతరవర్గాల ప్రజల మాదిరిగా వీరూ అభివృద్ధి సాధించాలంటే ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వారికి ప్రత్యేక హక్కులు, రక్షణలు కల్పించాలి.
అటవీ హక్కుల చట్టం అమలులోకి వచ్చి 12 ఏళ్లు దాటుతున్నా క్షేత్రస్థాయిలో అమలు అంతంత మాత్రంగానే ఉంది. చట్టాన్ని సవాలుచేస్తూ వైల్డ్ లైఫ్ ఫస్ట్ అనే సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరి 13న తీర్పిచ్చింది. ఇది దేశవ్యాప్తంగా సుమారు 42 లక్షల ఆదివాసులపై ప్రభావం చూపింది. వారు సొంతగడ్డపై బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన దుస్థితి కల్పించింది. ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దే లక్ష్యంతో తీసుకువచ్చిన ఈ చట్టం వారికి తగిన భరోసా ఇవ్వడంలో విఫలమైంది.
దేశవ్యాప్తంగా 2018 నవంబరు నాటికి గిరిజనులకు సంబంధించిన 42 లక్షల వినతుల్లో దాదాపు 20 లక్షల వ్యక్తిగత, ఉమ్మడి, అటవీ హక్కుల వినతులను తిరస్కరించారు. వీటిలో 4.62 లక్షల వినతులతో ఛత్తీస్ గఢ్ మొదటిస్థానంలో, 3.62 లక్షల వినతులతో మధ్యప్రదేశ్ 1.81 లక్షల వినతులతో కర్ణాటక రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ లో 75,927, తెలంగాణలో 83,757 వినతులను తిరస్కరించారు. సుప్రీంకోర్టులో దాఖలైన వ్యాజ్యంలో ఆదివాసుల తరఫున ప్రభుత్వం సరిగ్గా వాదన వినిపించలేకపోయిందన్న అభిప్రాయం ఉంది. నిరక్షరాస్యులైన ఆదివాసులు స్థానికంగా నిర్వహించే వారపు సంతల్లో మోసపోతున్నారు. వ్యాపారులు సంతల్లో కల్తీ, నాసిరకం వస్తువులను అమ్ముతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.