తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అంతర్జాతీయ స్థాయికి 'పలాశ్' రుచులు - jharkhand palash news

ఓ చిన్న గదిలో ప్రారంభమైన ఝార్ఖండ్ మహిళల వ్యాపారం.. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్​ లక్ష్యంగా పరుగులు పెడుతోంది. స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలుగొందుతోంది. అక్కడి మహిళల జీవితాల్లో అనూహ్య మార్పులకు నాంది పలికింది. మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు 'పలాశ్' పేరుతో మార్కెటింగ్ కల్పిస్తోంది ప్రభుత్వం.

palash
పలాశ్

By

Published : Nov 10, 2020, 3:09 PM IST

అంతర్జాతీయ స్థాయికి 'పలాశ్' రుచులు

కోట్ల కొద్దీ టర్నోవర్ ఉన్న ఎన్నో పరిశ్రమలు ఒకప్పుడు చిన్న రేకుల షెడ్డులోనే ప్రారంభమైన వార్తలను కథలు కథలుగా చదివాం. అదే విధంగా చిన్న గదిలో తయారయ్యే ఉత్పత్తులు ఎంతో ప్రాచుర్యం పొందిన దాఖలాలూ ఉన్నాయి. అచ్చం ఇలాగే ఝార్ఖండ్​కు చెందిన శోభా దీదీ తయారు చేస్తున్న ఆవకాయల రుచులకు రాష్ట్రమంతటా గుర్తింపు లభిస్తోంది.

రాంచీ, నమ్​కుమ్ బ్లాక్​లోని కుతియతు గ్రామానికి చెందిన శోభా దీదీ.. ఆర్థిక కష్టాల నుంచి బయటపడి ఇప్పుడు సొంతంగా ఉపాధి పొందుతున్నారు. తాను నిలదొక్కుకోవడమే కాకుండా ఇతర మహిళలకూ అండగా ఉంటున్నారు. స్వయం ఉపాధితో తన జీవితంతో పాటు సహచర మహిళల జీవితాలను వెలుగులమయం చేస్తున్నారు.

పచ్చళ్ల వ్యాపారంతో..

2008 నుంచి ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడిన దీదీ.. స్వయం సహాయక సంఘాల ద్వారా రుణం తీసుకొని పచ్చళ్ల తయారీని ప్రారంభించారు. మామిడికాయలతో పాటు, మిరప, కందగడ్డలు, ఇతర దుంపలతో పచ్చళ్లు తయారు చేస్తున్నారు.

"ప్రారంభంలో మాకు ఎలాంటి సౌకర్యాలు లేవు. సామాన్లు కొనేందుకు వాహనాలు అందుబాటులో లేవు. 2008లో అయితే ఈ ప్రాంతంలో ఆటో రిక్షాలు కూడా తిరిగేవి కాదు. ఎక్కడికైనా వెళ్లేందుకు మోటార్ సైకిళ్లు, లారీ డ్రైవర్లను లిఫ్ట్ అడిగి వెళ్లాల్సి వచ్చేది."

-శోభా దీదీ, లక్ష్మి శ్రీ మహిళా సమితి

ఆవకాయలు అమ్మడం ద్వారా వచ్చిన కొద్దిపాటి డబ్బుతో సొంతంగా ఇళ్లు నిర్మించుకున్నారు శోభ. తన ఇళ్లు చూడటానికి చిన్నగా ఉన్నా.. అది ఓ ఫ్యాక్టరీ కంటే తక్కువేం కాదనేది ఆమె అభిప్రాయం. శోభా దీదీకి స్వయం సహాయక బృంద సభ్యులు సహాయం చేస్తున్నారు. పచ్చడి డబ్బాలకు లేబుళ్లు వేయడం, మూతలు బిగించడం వంటి పనులు చేసిపెడుతుంటారు. 12 ఏళ్ల శ్రమ ఇప్పుడు తనకు గుర్తింపు తీసుకొస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు శోభ.

"మా వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఒక దుకాణం కావాలి. మేం సరకులను కొంటాం, ప్యాకింగ్ చేసుకుంటాం. అన్ని పనులు స్వయంగానే చేస్తాం. మాకు దుకాణం మాత్రం లేదు."

-శోభా దీదీ, లక్ష్మి శ్రీ మహిళా సమితి

స్వయం ఉపాధి వల్ల దీదీకి గుర్తింపు లభించడమే కాకుండా సహచర మహిళల జీవితాలు కూడా మారిపోయాయి. ఇంతకుముందు గుడుంబా అమ్మి జీవనం సాగించే వీరి జీవితాల్లో పెను మార్పులు సంభవించాయి. తమ పిల్లలను ఇప్పుడు స్కూళ్లకు పంపిస్తున్నారు. మెరుగైన జీవితం సాగిస్తున్నారు.

"నాకు నలుగురు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు అందరూ స్కూల్​కి వెళ్తున్నారు. పిల్లల్ని నేను చదివిస్తున్నాను. వారు బాగా జ్ఞానం సంపాదించి జీవితంలో ప్రయోజకులు అవుతారు."

-సునీతా దీదీ, స్వయం సహాయక బృంద సభ్యురాలు

ప్రభుత్వ సహకారంతో..

ఝార్ఖండ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు చెందిన రాష్ట్ర జీవనోపాధి ప్రచార సొసైటీ(జేఎస్​ఎల్​పీఎస్) ఈ మహిళల కలలు సాకారమయ్యేందుకు తోడ్పడుతోంది. స్వయం సహాయక మహిళలు తయారు చేసే వివిధ రకాల ఉత్పత్తులకు 'పలాశ్' పేరుతో ప్రచారం కల్పిస్తోంది. ఉత్పత్తుల విక్రయానికి సెక్రెటేరియట్ సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కౌంటర్లను ఏర్పాటు చేసింది. మోరింగా టీ, టెట్రా ప్యాక్​లో నిల్వచేసిన మేక పాలు, తేనె, మూలికా సబ్బులు, చింతపండు కేకులు, బ్లాక్​బెర్రీ వెనిగర్, పచ్చళ్లు సహా 37 రకాల ఉత్పత్తులను విక్రయిస్తోంది.

త్వరలోనే ఫ్లిప్​కార్ట్, అమెజాన్, రిలయన్స్ మార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లలో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. తద్వారా వీటికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం లభించనుందని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, 2023-24 సంవత్సరం నాటికి వెయ్యి కోట్ల టర్నోవర్ వస్తుందని అంచనా వేస్తున్నారు.

శోభా దీదీ లాగే ఝార్ఖండ్​లో దాదాపు లక్షా 9వేల మంది మహిళలు ఇప్పుడు తమ కాళ్ల మీద నిలబడుతున్నారు. స్వయంగా ఉపాధి మార్గాలను అన్వేషించుకున్నారు. మహిళలు శక్తిమంతంగా తయారైతే సమాజం పటిష్ఠంగా మారుతుందంటారు. ఝార్ఖండ్​లో ఈ దిశగా అడుగులు పడుతున్నాయి. అయితే ఈ మార్పులు మరింతగా వేళ్లూనుకోవాల్సిన అవసరం ఉంది.

ఇదీ చదవండి-కేరళలో బుల్లి ఏనుగుకు పుట్టినరోజు వేడుకలు

ABOUT THE AUTHOR

...view details