పెద్ద ఎత్తున ముష్కరులు భారత్లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు వెల్లడించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని శిబిరాలన్నీ ఉగ్రవాదులతో నిండిపోయినట్లు తెలిపారు. జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల సంఖ్య తగ్గిపోయిందని, వారి స్థానాన్ని భర్తీ చేసే విధంగా దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.
కశ్మీర్లో శాంతిభద్రతల సమస్య లేదని చెప్పిన ఆయన.. ఈ విషయం పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోతోందని అన్నారు.
"ఉగ్రవాదం వెన్నెముక దాదాపుగా విరిగిపోయింది. కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత విజయవంతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదులు రెచ్చిపోయే అవకాశం ఉంది. చనిపోయిన ముష్కరుల స్థానాన్ని భర్తీ చేసే విధంగా సరిహద్దు దాటి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న అన్ని క్యాంపులు, దాదాపు 15 లాంచ్ ప్యాడ్లు ఉగ్రవాదులతో నిండిపోయి ఉన్నాయి. పాకిస్థాన్ ఆర్మీ సహాయంతో భారత్లోకి చొచ్చుకురావడానికి సిద్ధంగా ఉన్నారు."
-లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు, ఆర్మీ కమాండర్
దాదాపు 30 ఏళ్ల నుంచి పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తుందన్నారు లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు. ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించేందుకే కాల్పుల విరమణను ఉల్లంఘిస్తోందని చెప్పారు. అయితే ఈ ప్రయత్నాలన్నింటికీ భారత్ దీటుగా జవాబిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో తమ అజెండాను ముందుకు తీసుకెళ్లలేక పాకిస్థాన్ చతికిలపడిందని పేర్కొన్నారు.
'వారిని వదిలేది లేదు'
భారత సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఆయుధాలు చేతబట్టిన ఏ ఒక్కరినీ విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అలాంటి వారిని అడ్డుకునేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందని తెలిపారు.