భారీ ఆశల నడుమ యువ నాయకులను అనుచరులుగా ఎంచుకొని లోక్‌సభ ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి నిరాశే ఎదురైంది. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరభవం చవిచూసింది. ఫలితాలు ఆ పార్టీ నాయకుల భవితవ్యాన్ని సందిగ్ధంలో పడేశాయు. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేశారు. పార్టీ నేతలు ఎంతగా బతిమాలినా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు రాహుల్.
రాహుల్ బాటలో అనుచరులు
రాహుల్‌కు సంఘీభావంగా ఆయన బృందంలోని సభ్యులు ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తున్నారు. జ్యోతిరాదిత్య సింధియా, మిలింద్ దేవరా వంటి నాయకులు తమ రాజీనామాలను ఏఐసీసీ ముందుంచారు. జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కేశవ చంద్ర యాదవ్ శనివారం రాజీనామా చేశారు. అంతకుముందే ఏఐసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ నితిన్ రావత్ కూడా తన రాజీనామాను సమర్పించారు. రాహుల్ రాజీనామా తర్వాత గోవా కాంగ్రెస్ చీఫ్ గిరీశ్ చోడంకర్ తన పదవి నుంచి వైదొలిగారు. దిల్లీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న రాహుల్ లిలోతియా కూడా పదవి నుంచి తప్పుకున్నారు.
మళ్లీ సీనియర్ల శకం..
కాంగ్రెస్‌లో తిరిగి సీనియర్ల శకం మొదలైందన్న వాదన వినిపిస్తోంది. ఇందుకు రాహుల్ రాజీనామా తర్వాత జరిగిన సమావేశాల్లో అధికంగా సీనియర్లు పాల్గొనడమే కారణంగా తెలుస్తోంది. ఈ సమావేశాల్లో అహ్మద్‌పటేల్, గులాం నబీ ఆజాద్, మోతీలాల్ వోరా, ఆనంద్ శర్మ, భూపీందర్ సింగ్ హుడా వంటి సీనియర్ నాయకులు పాల్గొని పార్టీకి సంబంధించిన వేర్వేరు అంశాలపై చర్చించారు. రాహుల్‌కు ఆంతరంగికులుగా పేరొందిన యువ నేతలు ఎవరూ ఈ సమావేశాల్లో పాల్గొనలేదు.
నూతన అధ్యక్షుడి ఎన్నికలో తాము జోక్యం చేసుకోబోమని ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడి ఎన్నికలో నిర్ణయాధికారం పూర్తిగా సీనియర్ నేతలకే ఉంటుంది. పార్టీ పరంగా అంతిమ నిర్ణయం తీసుకునే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోనూ సీనియర్ల నిర్ణయమే చెల్లుబాటయ్యే పరిస్థితి కనిపిస్తోంది.