చంద్రయాన్ -2 ప్రయోగాన్ని విజయవంతం చేయడంలో ఇస్రోలోని ప్రతి శాస్త్రవేత్త సహకారం అమూల్యమైనది. అయితే కొద్దిమంది మాత్రం తమ నాయకత్వంతో ముందుండి నడిపిస్తారు. ఇది అత్యంత క్లిష్టమైన లక్ష్యమే.. కానీ దాన్ని ఎలా చేరుకోవాలో ఇస్రోకు బాగా తెలుసు. గతంలో విజయవంతంగా చేపట్టిన వందలాది మిషన్లే వారికి స్ఫూర్తి. ఈ మిషన్‌ను విజయవంతంగా ప్రారంభించినందుకు ఇస్రో బృందం... దేశం నుంచి ప్రశంసలను అందుకున్నప్పటికీ, ఈ పనికి నాయకత్వం వహించి, దానిని వాస్తవికత వైపు తీసుకెళ్లడానికి బాధ్యత వహించిన అనేక మంది ముఖ్య సభ్యులు ఉన్నారు.
శివన్...
ఇటీవల సంవత్సరాలలో ఇస్రో చేపట్టిన అన్ని ప్రయత్నాలలో తోటి శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తి, ఆ సంస్థ ఛైర్మన్.. కె. శివన్. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి అయిన శివన్... 1982లో ఇస్రోలో చేరారు. 2006 లో ఐఐటీ బాంబే నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ పూర్తి చేశారు. 1980ల దశకంలో పీఎస్ఎల్వీ ప్రాజెక్టులో ఆయన పనిచేస్తున్నప్పుడు మిషన్ ప్లానింగ్, మిషన్ డిజైన్, మిషన్ ఇంటిగ్రేషన్ అండ్ అనాలిసిస్‌లో తన ప్రతిభను నిరూపించుకున్నారు.
ఏప్రిల్ 2011 లో జీఎస్ఎల్వీ ప్రాజెక్టులో ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా శివన్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆయన నేతృత్వంలోనే ఇస్రో ఒకే మిషన్ ద్వారా 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టగలిగింది. 2017 ఫిబ్రవరిలో చేపట్టిన ఆ మిషన్ ప్రపంచ రికార్డు సృష్టించింది.
ఉపగ్రహాలను కక్ష్యల్లోకి ప్రవేశపెట్టగలిగే సాంకేతికతలో ఆయన పట్టు సాధించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జీఎస్ఎల్వీ ఎమ్కే-2 ను అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇస్రో ఛైర్మన్‌గా ప్రాజెక్ట్, డిజైన్, ప్లానింగ్, లాంచ్ వంటి ప్రతి దశకు ఆయన బాధ్యత వహిస్తారు. ప్రతిదీ ఆయన పరిశీలన, ఆమోదం ద్వారా వెళుతుంది. మిషన్‌కు సంబంధించిన అన్ని నిర్ణయాలను ఛైర్మన్ శివన్ మాత్రమే తీసుకుంటారు.
పి. కున్హికృష్ణన్...
చంద్రయాన్-2 ప్రాజెక్టులో మరో ముఖ్య శాస్త్రవేత్త.. పి. కున్హికృష్ణన్. బెంగళూరులోని యూఆర్ రావ్ ఉపగ్రహ కేంద్రం డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ముందుచూపు, కచ్చితమైన ప్రణాళికకు పేరుగాంచిన కున్హికృష్ణన్... షార్ డైరెక్టర్‌గా, పీఎస్ఎల్వీ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఆయన 13 పీఎస్ఎల్వీ వరుస మిషన్లు విజయవంతంగా పూర్తిచేశారు. ఉపగ్రహాల డిజైన్, అభివృద్ధి, పరిపూర్ణత సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. చంద్రయాన్-2 ప్రాజెక్టు డిజైన్, అభివృద్ధిలోనూ ఆయన విలువైన సేవలను అదించారు.