తమిళనాట నీటి సంక్షోభం నానాటికీ తీవ్ర రూపం దాలుస్తోంది. తాగునీటి కోసం అక్కడి ప్రజలు కటకటలాడుతున్నారు. తాజాగా మధురై కార్పొరేషన్ పరిధిలోని ఐరావతనల్లూరులో రేషన్ కార్డుకు ఒక కూపన్ లెక్కన పంచి తాగునీటి సరఫరా చేపట్టాలని నిర్ణయించడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.
వేసవి తాపం ధాటికి తమిళనాట జలవనరులు అడుగంటాయి. వరుణుడు సకాలంలో కరుణించకపోవడం సమస్యను మరింత పెంచింది. ప్రభుత్వం కూడా చేసేది లేక చేతులెత్తేస్తోంది. చివరకు వర్షాలు కురవాలని అధికార ఏఐఏడీఎంకే పార్టీ పెద్దలు దేవాలయాల్లో యజ్ఞయాగాలు నిర్వహించారు.