ప్రధాని నరేంద్ర మోదీ ముంబయి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. అయితే.. ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ ఇక్కడ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇటీవల దక్షిణ ముంబయి లోక్‌సభ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ దేవరాకు... తండ్రి మద్దతుగా నిలిచారు. తాజాగా కుమారుడు భాజపా సభలో ఉండటం చర్చనీయాంశంగా మారింది.
దేశానికి మద్దతుగా నిలవడానికి... ప్రధాని ప్రసంగం వినడానికి వచ్చినట్లు పేర్కొన్నారు అనంత్ అంబానీ.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాజకీయ ప్రచారాల్లో రఫేల్ ఒప్పందాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ భాజపాపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి ప్రధాని అనుచిత లబ్ధి చేకూర్చారని ఆరోపిస్తుంటారు రాహుల్. ఈ తరుణంలో తండ్రి కాంగ్రెస్‌కు మద్దతు... భాజపా సభలో తనయుడు అనంత్ అంబానీ ప్రత్యక్షమవడం రాజకీయ వర్గాలను ఆలోచనలో పడేసింది.