'స్వచ్ఛ భారత్ 2.0 తప్పనిసరి' స్వచ్ఛ భారత్... దేశాన్ని పరిశుభ్రంగా మార్చే మహోన్నత లక్ష్యంతో ప్రారంభించిన కార్యక్రమం. ఈ పథకంలో భాగంగానే 23 రాష్ట్రాలు బహిరంగ మల విసర్జన రహితం(ఓడీఎఫ్)గా ప్రకటించుకున్నాయి. ఈ ప్రకటనకు ఆధారం గృహాలకు సమానంగా మరుగుదొడ్లు ఉండటమే. కానీ ఈ రాష్ట్రాల్లో బహిరంగ మల విసర్జన పూర్తిగా ఆగిపోయిందా? అంటే లేదనే అంటున్నారు నిపుణులు.
స్వచ్ఛ భారత్ వల్ల మరుగుదొడ్ల నిర్మాణం జరిగినప్పటికీ వాటిని ప్రజలు ఉపయోగించట్లేదు. ప్రజల ఆలోచనలో మార్పు తీసుకొచ్చేందుకు రెండో తరం స్వచ్ఛ భారత్(స్వచ్ఛ భారత్ 2.0) చేపట్టాలని నిపుణులు కోరుతున్నారు. అప్పుడే వాస్తవ స్పచ్ఛ భారత్ సాధ్యమవుతుందన్నదని వారి విశ్లేషణ.
ఈ విషయమై సెంటర్ ఫర్ అర్బన్ అండ్ రీజినల్ ఎక్సలెన్స్(క్యూర్) డైరెక్టర్ డాక్టర్ కోస్లా ఈటీవీ భారత్‌తో అభిప్రాయాలు పంచుకున్నారు.
నగరాల్లో ఇంకా బహిరంగ విసర్జన ఉందా? మీరు గమనించిన విషయాలేంటి?
నగరాలు బహిరంగ విసర్జన రహితంగా ప్రకటించుకుంటున్నాయి. కానీ వాస్తవంగా అవి కావు. లోతుగా పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది. మేము తయారు చేసే ప్రత్యేక డేటాబేస్‌లో దీన్నే గమనించాం. ప్రజా మరుగుదొడ్లు, సామాజిక మరుగుదొడ్లను మ్యాపింగ్ చేస్తూ... వివిధ నగరాలకు సహాయపడుతున్నాం. బహిరంగ మలమూత్ర విసర్జన ప్రాంతాలనూ మ్యాపింగ్ చేశాం. నగరాల్లో ఇంకా బహిరంగ విసర్జన కొనసాగుతోంది.
ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
మరుగుదొడ్ల సంఖ్యను బట్టి ఓడీఎఫ్‌గా ప్రకటించుకోవచ్చు. కానీ వాటిని ఉపయోగించకపోతే అది నిజమైన ఓడీఎఫ్ కాదు. కాబట్టి రెండో తరం స్వచ్ఛ భారత్ మిషన్ కావాలి. ఇది మనిషి ప్రవర్తనపై దృష్టి సారించాలి. దీనితో పాటు సామాజిక మరుగుదొడ్లను వ్యక్తిగతమైన వాటిగా మార్చాలి. స్వచ్ఛ భారత్ 2.0 కేవలం వ్యక్తిగత మరుగుదొడ్లకే ప్రాధాన్యం ఇవ్వాలి. రుణంతో పాటు పేద వాళ్లు మరుగుదొడ్లు నిర్మించుకోవటానికి కావాల్సిన మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలి. వీటన్నింటితో నగరాలు పరిశుభ్రంగా మారతాయి.