తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కర్ణాటకీయం'కు ముగింపు దొరికేనా...? - కాంగ్రెస్​

కర్ణాటక రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. కొలిక్కివస్తుందనుకున్న 'సంకీర్ణ సర్కార్​ సంక్షోభం' నేడు స్పీకర్​ చేసిన వ్యాఖ్యలతో మరింత కాలం కొనసాగేలా కనిపిస్తోంది. అసంతృప్తుల్ని బుజ్జగించేందుకు కాంగ్రెస్ చేస్తున్న​ ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించట్లేదు. రాజీనామాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరికొంత మందీ అదే బాటలో పయనించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భాజపా తన ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

'కర్ణాటకీయం'కు ముగింపు దొరికేనా...?

By

Published : Jul 9, 2019, 3:18 PM IST

కర్ణాటక రాజకీయ సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. కాంగ్రెస్​, భాజపా నేతలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. లోక్​సభ, రాజ్యసభల్లోనూ ఇదే అంశంపై ఆందోళనలు తీవ్రమయ్యాయి. రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. దిగువ సభ నుంచి కాంగ్రెస్​ నేతలు వాకౌట్​ చేశారు.

సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబాటుతో ఇప్పటికే 14 మంది ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేశారు. కాంగ్రెస్​ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే రోషన్​ బేగ్​ నేడు రాజీనామా చేశారు. వీరితో మొత్తం సంఖ్య 15కు చేరింది. మరికొంత మంది ఎమ్మెల్యేలు ఇదే బాటలో పయనించనున్నట్లు తెలుస్తోంది.

మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మంత్రి పదవులకు రాజీనామా చేసి.. భాజపాకు మద్దతు ప్రకటించారు. ఫలితంగా.. సంకీర్ణ ప్రభుత్వానికి సమస్యలు తప్పేలా లేవు. విధానసభలో కూటమి బలం తగ్గిపోతోంది.

నేడు ముంబయి, దిల్లీ వెళ్లను: రోషన్​

కాంగ్రెస్​ శాసనసభ్యత్వానికి ఈ రోజు రాజీనామా చేశారు బహిష్కరణకు గురైన రోషన్​ బేగ్​. ఈయన శివాజీనగర్​ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. మిగతా రెబల్స్​లా తాను ముంబయి లేదా దిల్లీ హోటళ్లకు వెళ్లనని మీడియాకు తెలిపారు.

పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడిన కారణంతో రోషన్​ను గతంలోనే పార్టీ నుంచి బహిష్కరించింది కాంగ్రెస్​.

మెజార్టీకి దూరంలో...

కర్ణాటక అసెంబ్లీ స్థానాలు 224.

15 మంది రాజీనామాల్ని స్పీకర్​ ఆమోదిస్తే.. సభలో మిగిలే సభ్యుల సంఖ్య- 209(స్పీకర్​తో కలిపి)

మేజిక్​ నంబరు-105

స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో భాజపా బలం- 107

సంకీర్ణ కూటమి బలం- 102 (కాంగ్రెస్​- 66, జేడీఎస్​- 34, బీఎస్పీ- 1, స్పీకర్​-1)

సమయముంది.. చూద్దాం..

రాజీనామాలపై స్పీకర్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తననెవరూ సంప్రదించలేదని.. ఈ అంశంలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. దీనికి నిర్ణీత గడువు అంటూ ఏమీ లేదని పేర్కొన్నారు. అనంతరం.. గవర్నర్​ను కలిసిన ఆయన.. రాజీనామాల్లో కొన్ని చెల్లవని చెప్పారు.

"రెబల్​ ఎమ్మెల్యేలు ఎవరూ నన్ను కలవలేదని గవర్నర్​కు సమాచారం అందించా. నేను రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తానని గవర్నర్​ విశ్వాసం వ్యక్తంచేశారు. 13 రాజీనామాల్లో 8 నిబంధనల ప్రకారం లేవు. ఆ లేఖలు సమర్పించిన వారు నన్ను కలవాలని సూచించా."

-రమేశ్​ కుమార్​, కర్ణాటక అసెంబ్లీ స్పీకర్

సిద్ధరామయ్య హెచ్చరిక...

కర్ణాటక సంక్షోభం నేపథ్యంలో నేడు సీఎల్పీ భేటీ అయింది. కాంగ్రెస్​ ముఖ్య నేతలు సిద్ధరామయ్య, కేసీ వేణుగోపాల్​ తదితరులు హాజరయ్యారు. అనంతరం.. మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్​ శాసనసభా పక్ష నేత సిద్ధరామయ్య.

అసంతృప్త ఎమ్మెల్యేలు తిరిగి రాకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. వారిని రాజీనామాలు ఉపసంహరించుకోవాలని కోరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఆరు సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని స్పీకర్​ను కోరనున్నట్లు వెల్లడించారు.

మోదీ, భాజపాపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.

"ప్రభుత్వాలను అస్థిరపరచడం భాజపాకు అలవాటుగా మారింది. ఇలా చేయడం అప్రజాస్వామికం. ప్రభుత్వం ఏర్పాటు చేయమని ప్రజలు భాజపాకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు. మాకే ఎక్కువ ఓట్లు ఇచ్చారు. జేడీఎస్​, కాంగ్రెస్​కు కలిపి 57శాతానికిపైగా ఓట్లు వచ్చాయి.

ఈసారి రాష్ట్ర భాజపా నేతలు మాత్రమే కాదు... అమిత్​షా, మోదీ వంటి జాతీయ స్థాయి నేతలు ఇందులో భాగస్వాములై ఉన్నారు. వారి ఆదేశాల మేరకే మా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి."

-సిద్ధరామయ్య, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి

భాజపా ప్రయత్నాలు..

కాంగ్రెస్​ బుజ్జగింపులు, హెచ్చరికలు చేస్తుండగా.. భాజపా సమయం కోసం చూస్తోంది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తోంది. సంకీర్ణ ప్రభుత్వానికి అసెంబ్లీలో మెజార్టీ లేదని.. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ఆందోళనలు చేస్తున్నారు పార్టీ నేతలు.

స్పీకర్​ రాజీనామాల్ని ఆమోదిస్తే.. బలం నిరూపించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తోంది కమలదళం.

ABOUT THE AUTHOR

...view details