మురుగు తొలగింపు, మ్యాన్‌హోల్‌లో శుభ్రం చేసే క్రమంలో పారిశుధ్య కార్మికులు మృత్యువాత పడుతుండటంపై సుప్రీంకోర్టు స్పందించింది. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇలా జరగడం లేదని వ్యాఖ్యానించింది. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా దేశంలో ఇప్పటికీ వివక్ష కొనసాగుతోందని ఆవేదన వ్యక్తంచేసింది. మ్యాన్‌హోల్స్ శుభ్రం చేసే క్రమంలో పారిశుధ్య కార్మికులు మృతి చెందుతున్న ఘటనలపై సుప్రీంకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.
ఈ మేరకు జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. మ్యాన్‌హోల్స్‌లో దిగే పారిశుధ్య కార్మికుల రక్షణార్థం మాస్కులు, ఆక్సిజన్ సిలిండర్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది.