సహస్రాబ్దాల మతవిశ్వాసం, శతాబ్దాల క్రితం జరిగిందంటున్న విధ్వంసం, దశాబ్దాలుగా కొనసాగుతున్న న్యాయసంవాదం- వీటన్నింటి పర్యాయపదమైన అయోధ్య భూవివాదంపై తుది వాదనలకు సుప్రీంకోర్టులో తెరపడింది. 40 రోజుల సుదీర్ఘ విచారణ దరిమిలా ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే నెలరోజుల్లోగా తీర్పు వెలువరించనున్నట్లు రాజ్యాంగ ధర్మాసనం చేసిన ప్రకటన- దేశాన్ని కలవరపెడుతున్న సంక్షోభానికి సతార్కిక ముగింపుపై కొత్త ఆశలు రేకెత్తిస్తోంది! సుప్రీం సారథ్యంలోనే ఏర్పాటైన ముగ్గురు సభ్యుల మధ్యవర్తిత్వ మండలి సైతం నిన్ననే తన నివేదిక సమర్పించడం, కీలక కక్షిదారుల్లో ఒకటైన సున్నీ వక్ఫ్‌బోర్డు వివాదాస్పద భూమిపై హక్కును వదులుకోవడానికి సిద్ధపడటం గమనిస్తే సామరస్య పూర్వక పరిష్కారానికి మేలుబాటలు పడే అవకాశాన్నీ తోసిపుచ్చే వీల్లేదు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదే హద్దుమీరి సాక్ష్యాల ప్రతుల్ని చించివేసే స్థాయి ఉద్విగ్నతలు పెచ్చరిల్లిన కేసులో వాదవివాదాల ఉద్ధృతి చెప్పనలవి కాదు! అయోధ్య వ్యాజ్యాల పరిష్కారానికి ధర్మాసనం అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దీపక్ మిశ్రా స్పష్టీకరించినా, ఆయన పదవీవారసుడిగా జస్టిస్ రంజన్ గొగోయ్ స్వీయ విచక్షణాధికారంతో మొన్న జనవరిలో అయిదుగురు సభ్యుల పీఠాన్ని ఏర్పాటు చేశారు. హిందీ, ఉర్దూ, గురుముఖి, అరబిక్, సంస్కృతం, పర్షియన్ భాషల్లో 15 ట్రంకు పెట్టెలకొద్దీ ఉన్న కీలక పత్రాలను తర్జుమా చేయించి, ఆగస్టు ఆరో తేదీ లగాయతు రోజువారీ విచారణ చేపట్టిన సుప్రీం న్యాయపాలిక- ఎప్పుడో 1972నాటి కేశవానంద భారతి కేసు దరిమిలా దాదాపు అంతటి భూరి కసరత్తు చేసింది. అయోధ్య భూయాజమాన్య హక్కులపై 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన 14 అప్పీళ్ల పరిష్కార బాధ్యతను నిభాయించిన ధర్మాసనం- జస్టిస్ ఖలీఫుల్లా, శ్రీశ్రీ రవిశంకర్, శ్రీరాం పంచు సభ్యులుగా మధ్యవర్తిత్వ మండలినీ కొలువుతీర్చి కేసు సంక్లిష్టత దృష్ట్యా విశాల దృక్పథంతో వ్యవహరించింది. తుది ఫలితం కోసం ఎంతో ఉత్కంఠతో యావద్దేశం ఎదురుచూస్తోంది!
భారతావని మత సహిష్ణుతను కదలబార్చేలా అయోధ్య వివాదం సృష్టించిన మారణహోమం అంతా ఇంతా కాదు. కరసేవకుల కార్యాచరణతో బాబ్రీ కట్టడ విధ్వంసం సాగిన నేపథ్యంలో దేశం అట్టుడికిపోగా నాటి పీవీ ప్రభుత్వం 1993 జనవరిలో రాష్ట్రపతి ద్వారా ఏకవాక్య నివేదన సమర్పించి సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని అభ్యర్థించింది. ‘1992 డిసెంబరు ఆరు వరకు బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో పూర్వం ఎప్పుడైనా దేవాలయం ఉండేదా?’ అన్నది ఏకవాక్య నివేదన! సంక్షుభిత సమయంలో సర్కారు వేదనే నివేదనకు ప్రేరకమైనా- సుప్రీం వెల్లడించే అభిప్రాయానికి కట్టుబడి ఉండే అవసరం లేని విధంగా 143వ రాజ్యాంగ అధికరణ ద్వారా దాన్ని వండివార్చడం, కోర్టు అభిమతానికి తాము బద్ధులం కాబోమని కొన్ని పక్షాలు స్పష్టీకరించిన సమయంలో న్యాయపాలిక నాడు సరైన నిర్ణయమే ప్రకటించింది. కేంద్రం కోరిక మేరకు రాష్ట్రపతి చేసిన నివేదన అనవసరమైనది కాబట్టి, దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరమే లేదని సుప్రీం ధర్మాసనం నిష్కర్షగా తోసిపుచ్చింది. వివాదాస్పద భూమికి సంబంధించి హక్కు, పట్టా తదితర అంశాలపై కోర్టుల్లో ట్రైబ్యునళ్లలో పెండింగులో ఉన్న సకల న్యాయసంకటాల్నీ నిరోధించే చట్ట నిబంధనను మెజారిటీ న్యాయమూర్తులు నాడు కొట్టేయడంతో- ఆయా వ్యాజ్యాలకు కదలిక వచ్చింది. వివాదంలో ఉన్న మొత్తం ప్రాంగణంపై హక్కులు తమకే ఉన్నాయని ఏ పక్షమూ విస్పష్ట ప్రత్యక్ష సాక్ష్యాలను చూపలేకపోయిందంటూ 2010 సెప్టెంబరులో అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ సంచలన న్యాయనిర్ణయం ప్రకటించింది. అత్యంత కీలకమైన 1,500 గజాల స్థలాన్ని మూడు వాటాలు వేసి- రాముడి విగ్రహం ప్రతిష్ఠించిన చోటును హిందువులకు, తక్కిన రెండు వాటాల్ని నిర్మోహి అఖాడా, సున్నీ వక్ఫ్ బోర్డులకు అప్పగించాలని ఆదేశించింది. దానిపై అప్పీళ్లు నేడు రాజ్యాంగ ధర్మాసనం తుదితీర్పు కోసం వేచి ఉన్నాయి!