పౌరసత్వ చట్టానికి వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య ఘర్షణలతో అట్టుడికిన ఈశాన్య దిల్లీ ప్రస్తుతం కాస్త శాంతించింది. అల్లర్లు సద్దుమణిగాయి. క్రమక్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కొద్ది రోజులుగా భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడిపిన ప్రజలు ఇప్పుడిప్పుడే రోడ్లపైకి వస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కిరాణా దుకాణాలు, వ్యాపార సముదాయాలు తెరుచుకుంటున్నాయి.
7 వేల మంది బలగాలు..
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా భద్రతా దళాలను మోహరించారు అధికారులు. దిల్లీ పోలీసులతో పాటు సుమారు 7 వేల మంది పారామిలిటరీ బలగాలు గస్తీ కాస్తున్నాయి.
దిల్లీలోని చాంద్‌బాగ్‌లో పర్యటించారు జాయింట్ కమిషనర్ ఓపీ మిశ్రా. ప్రజలు భయపడకుండా తమ రోజువారీ జీవనాన్ని నిర్భయంగా కొనసాగించవచ్చని భరోసా కల్పించారు.
" సాధారణ పరిస్థితులకు ఇది సూచిక. మా సమక్షంలో దుకాణాలు తెరవాలని నేను భరోసా ఇస్తున్నా. నిన్నటి నుంచే సాధారణ పరిస్థితులు నెలకొనటం ప్రారంభమైంది. ఇక్కడ నివసించే వారికి మతాలకు అతీతంగా భరోసా కల్పించటమే మా తొలి ప్రాధాన్యం. కొద్ది రోజులుగా అల్లర్లతో ప్రభావితమైన తమ సాధారణ జీవనాన్ని తిరిగి ప్రారంభించాలని కోరుతున్నాం. మసీదులకు ప్రార్థనల కోసం వెళ్లేవారికి భద్రత కల్పించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. "