సార్వత్రిక ఎన్నికల ఆరో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు వరుసక్రమంలో బారులు దీరారు. ఆరో విడతలో భాగంగా 7 రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
ఆరో విడత సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 979 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 10 కోట్ల 17 లక్షల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. లక్షా 13 వేల పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో 14, హరియాణాలో 10, బిహార్, మధ్యప్రదేశ్, బంగాల్లో 8, దిల్లీలో 7, ఝార్ఖండ్‌లో 4 స్థానాలకు ఈ దశలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 979 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 10 కోట్ల 17 లక్షల మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.
'సార్వత్రికం' ఆరో విడత పోలింగ్ ప్రారంభం ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్న స్థానాల్లో.. 2014లో జరిగిన ఎన్నికల్లో 45 గెల్చుకుంది భాజపా. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరుగుతున్న 14 స్థానాల్లో 13 సొంతం చేసుకుంది.
పటిష్ఠ భద్రత నడుమ...
శాంతియుత వాతావరణంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా విస్తృత చర్యలు చేపట్టింది ఎన్నికల సంఘం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశమివ్వకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది. బంగాల్లో అల్లర్ల నేపథ్యంలో భారీగా కేంద్ర బలగాలను మోహరించింది.
రాజధాని దిల్లీ ప్రాంతంలోని 7 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. ఇక్కడ 60 వేల మంది భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారు.
బరిలో ప్రముఖులు...
ఈ దశలో ముఖ్యనేతలతో పాటూ.. ప్రముఖ క్రీడాకారులు ఎన్నికల బరిలో ఉన్నారు.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఆజంగఢ్ నుంచి పోటీ చేస్తున్నారు. కేంద్ర మంత్రి మేనకా గాంధీ సుల్తాన్‌పుర్ నుంచి పోటీలో ఉన్నారు.
- దిల్లీలో భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్, ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్‌లు తొలిసారి ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాంగ్రెస్ దిగ్గజ నాయకురాలు షీలా దీక్షిత్, కేంద్ర మంత్రి హర్షవర్ధన్, అతిషి హస్తిన లోక్‌సభ బరిలో ఉన్నారు.
- మధ్యప్రదేశ్ భోపాల్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, సాధ్వి ప్రజ్ఞా మధ్య పోటీ ఆసక్తి రేకెత్తిస్తోంది. గుణ స్థానం నుంచి జ్యోతిరాదిత్య సింధియా భవితవ్యం తేల్చుకోనున్నారు.
ఇంకా కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ థోమర్, రాధామోహన్ సింగ్, క్రిషణ్ పాల్ గుర్జార్, రావ్ ఇంద్రజిత్ సింగ్‌లు ఆరో దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
ఇదీ చూడండి:కన్నవారికి కుమార్తె అంతిమ సంస్కారాలు