రాజకీయాలు, క్రీడలు... వార్త పత్రికలో తొలి పేజీలో కనిపించేది ఒకటి. చివరి పేజీలో దర్శనమిచ్చేంది మరొకటి. ఒకదానికొకటి పొంతన లేని ఈ రెండు రంగాలు ఎన్నికల వేళ రాజకీయ సమరంలో కాలుదువ్వుతున్నాయి. ఇప్పటికే చాలామంది క్రీడాప్రముఖలు ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటే మరికొందరు ఇప్పుడిప్పుడే రాజకీయ ప్రస్థానంలో అడుగుపెడుతున్నారు.
2014లో సత్తా చాటిన క్రీడాకారులు
రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్.. సైనికుడిగా జీవితాన్ని ప్రారంభించారు. షూటింగ్లో రాణించి ఒలింపిక్స్ వెండి పతకం సాధించారు. గత ఎన్నికల్లో భాజపా తరఫున ఎంపీగా గెలిచారు. క్రీడాశాఖ మంత్రిగా పనిచేసిన తొలి క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం... కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
"సైనికుడిగా, క్రీడాకారుడిగా రాణించిన నేను రాజకీయాల్లో పనికొస్తానా అని నన్ను నేను ప్రశ్నించుకున్నా. అనంతరం దేశానికి సేవ చేయడం నా ధర్మం అని నిర్ణయించుకున్నా."
-- రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్, కేంద్రమంత్రి
గత సార్వత్రిక ఎన్నికల్లో రాఠోడ్తోపాటు మాజీ క్రికెటర్ కీర్తి అజాద్(భాజపా తరఫున గెలిచి కాంగ్రెస్‌కు మారారు), ఫుట్‌బాల్ ఆటగాడు ప్రసూన్ బెనర్జీ(తృణముల్ కాంగ్రెస్), షూటర్ నారాయణ్ సింగ్ దేవ్(బిజూ జనతా దళ్)ఎంపీలుగా గెలిచారు. వచ్చే ఎన్నికల్లోనూ విజయంపై ధీమాగా ఉన్నారీ రాజకీయాటగాళ్లు.
గత ఎన్నికల్లో బౌల్డ్....
2014 సార్వత్రిక ఎన్నికల్లో అజారుద్దీన్, నవజ్యోత్‌సింగ్ సిద్ధుకు నిరాశే మిగిలింది. అజారుద్దీన్ కాంగ్రెస్ తరఫున మోరాదాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అమృతసర్ సీటు ఆశించిన సిద్ధు.. కుదరకపోయేసరికి భాజపాకు రాజీనామా చేశారు. 2017 పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచి, మంత్రిగా కొనసాగుతున్నారు.
మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ 2009లో కాంగ్రెస్ తరఫున ఉత్తరప్రదేశ్‌లోని పుల్ఫూర్ నుంచి పోటీ చేసి పరాజయం చెందాడు. జాతీయ స్విమ్మిగ్ ఛాంపియన్ నఫిసా అలీ 2004, 2009లో కాంగ్రెస్ నుంచి రెండుసార్లూ ఓటమిపాలైంది. ఫుట్‌బాల్ ఆటగాడు భాయ్ఛుంగ్ భూటియా 2014లో తృణముల్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి పరాజయం చవిచుశాడు. ఈసారి స్వరాష్ట్రం సిక్కింలో సొంత పార్టీ హమ్రో సిక్కిం తరఫున పోటీ చేయనున్నాడు.
ప్రస్తుతం ఈ రాజకీయ సమరంలో గౌతమ్ గంభీర్ అడుగుపెడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. భాజపా తరఫున రానున్న ఎన్నికల్లో పోటీచేయనున్నట్టు ఊహగానాలొస్తున్నాయి. 2011 క్రికెట్ ప్రపంచకప్ గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించిన ఈ మాజీ ఓపెనర్ ఎన్నికల పిచ్‌పై బౌండరీ కొడతాడో, బౌల్డౌతాడో వేచిచూడాలి.
క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివా సోలంకి ఇటీవలే భాజపాలో చేరారు. రాజకీయాల్లో ఆమె భవిష్యత్ కార్యాచరణపైనా ఆసక్తి నెలకొంది.
నామినేటెడ్ క్రీడాకారులు
క్రీడా విభాగంలో 2012లో సచిన తెందూల్కర్‌ను రాజ్యసభ ఎంపీగా రాష్ట్రపతి నామినేట్ చేశారు. అనంతరం 2016లో మేరికోమ్ రాజ్యసభ సభ్యురాలిగా నామినేటైంది.
క్రీయాశీల రాజకీయాల్లో లేకపోయినా కొంతమంది క్రీడాకారులు ప్రజల్లో ఓటింగ్‌పై చైతన్యం తీసుకొస్తున్నారు. ప్రధాని పిలుపు మేరకు సచిన్ , విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, సెహ్వాగ్, రెజ్లర్ భజరంగ్ పునియా ఓటు అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.