ఆమె తీసిన చిత్రాలు ఎంతో ప్రత్యేకమైనవి. ముఖ్యంగా పక్షులు గూళ్లు అల్లడం, వాటి వేట దృశ్యాలు ఆమె మనోహరంగా చిత్రీకరిస్తారు. అందుకే అభిమానులు ఆమెను 'యాక్షన్ ఫోటోగ్రాఫర్' అని పిలుచుకుంటారు. ఆమే రాధిక రామస్వామి. ఆమె ఇంటర్వ్యూ మీకోసం..
మీరు ఎలా వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ అయ్యారు?
మా స్వస్థలం వెంకటాచలపురం, థేని. నాకు పదో తరగతి నుంచే ఫొటోగ్రఫీ మీద ఆసక్తి. ఆ రంగంపై ఉన్న అనురక్తే నన్ను ఈ స్థానంలో నిలబెట్టింది. మా నాన్నను కెమెరా కొనమని నేను అడిగేదాన్ని. మా కుటుంబం విహార యాత్రలకు వెళ్లేటప్పుడు పూలు, మొక్కలు, వన్యప్రాణులను చిత్రించాలనేది నా కోరిక అని చెప్పాను.
అపుడు మా నాన్న నాకు ఓ కెమెరా కొనిచ్చారు. అప్పటి నుంచి కెమెరాతో నా ప్రయాణం మొదలైంది. నేను దిల్లీలో ఉన్నప్పుడు డిజిటల్ కెమెరా వచ్చింది. దాంతో నేను దిల్లీలోని చారిత్రక కట్టడాలను చిత్రించేదాన్ని. వాటిని చూసి చాలా ఆనందించేదాన్ని. తరువాత పక్షులు, జంతువులను కెమెరాలో బంధించడం మొదలుపెట్టా. ఆ విధంగా ఫొటోగ్రఫీపై నా ప్రేమ మరింత ఎక్కువైంది.
మీ చిత్రాలు పాఠ్యపుస్తకాల్లో అచ్చు అయ్యాయని తెలిసినపుడు మీరు ఎలాంటి అనుభూతి పొందారు?
నా గురించి, నా విజయాల గురించి ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో ప్రచురించడం నాకు చాలా గర్వకారణం. చాలా అంతర్జాతీయ పత్రికలు కూడా నా గురించి కథనాలు ప్రచురించాయి. నా పనికి గుర్తింపు రావడం... నాకు ఎంతో ఆనందం కలిగించే విషయం.
మీరు వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ కావడంలో మీ కుటుంబ సభ్యుల పాత్ర ఏమిటి?