కాలం 3 సంవత్సరాలు. మథనం 165 రోజులు. అధికరణలు 395. షెడ్యూళ్లు 12. ఆమోదం పొందింది 1949 నవంబరు 26. అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26.. గణాంకాల్లో చూస్తే ఇదీ భారత రాజ్యాంగ స్వరూపం.
రాజ్యాంగం ఆత్మ లోతుల్లోకి వెళితే మాత్రం అదో మహా చరిత్రాత్మక, విప్లవాత్మక పత్రం. దీనివెనుక ఎన్నో పోరాటాలు, మరెన్నో ఆకాంక్షలు, సామాజిక విప్లవ అభినివేశాలు కనిపిస్తాయి. కుల, మత, వర్గ, వర్ణ, లింగ వివక్ష లేకుండా ఒకే తరహా హక్కులు.. ఆస్తితో సంబంధం లేకుండా అందరికీ ఓటు హక్కు.. బహుళపార్టీ ప్రజాస్వామ్యం.. స్వతంత్ర న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్పష్టమైన అధికార విభజన.. అల్పసంఖ్యాక వర్గాలకు ప్రత్యేక రక్షణలు.. గిరిజనులకు, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు.. అధికార మతం అంటూ లేని లౌకికవాదం.. ఇవన్నీ కలగలిసి ఒకేసారిగా అమల్లోకి రావడం ప్రపంచంలో మరే దేశంలోనూ జరగలేదు.
అసాధారణ విజయం
ఆధునిక ప్రజాస్వామ్యానికి పుట్టినిళ్లుగా చెప్పుకొనే పలుదేశాల్లో మన రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కుల్లాంటివి రావడానికి ఏళ్లు పట్టింది. దేశ విభజనకు కారణమైన మతవాదం ఓవైపు నుంచి కమ్ముకొస్తున్నా.. ఆ పొరలను చీల్చుకుంటూ దాని ప్రభావం పడకుండా రాజ్యాంగ రచన చేయడానికి మహా యజ్ఞమే జరిగింది. ఆ మేధోమథనం అంతా అక్షరబద్ధం అయింది. ఒక్కో అధికరణం రూపొందడానికి ఎంత భావ సంఘర్షణ జరిగిందో చెప్పేందుకు 11 మహా సంపుటాలే సాక్ష్యాలు.
భిన్న దృక్పథాల ఏకత
మొదటి రాజ్యాంగ పరిషత్ సమావేశం 1946 డిసెంబరు 9న జరిగింది. రాజ్యాంగ పరిషత్‌లో 82 శాతం సభ్యులు కాంగ్రెస్‌కు చెందిన వారే. వీళ్లందరి ఆలోచనలు, దృక్పథాలు ఒక తీరులో ఉండేవి కావు. వీళ్లందరినీ సమన్వయపరుచుకుంటూ ప్రపంచంలో అతి పెద్దదయిన లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించడం మామూలు విషయం కాదు. దీన్ని ఎంత సమర్థంగా నిర్వహించినా మొత్తం కసరత్తు కాంగ్రెస్ నేతలకే పరిమితమైతే మన రాజ్యాంగం కూడా పరిమిత పరిధుల్లోనే ఉండేదేమో! అయితే రాజ్యాంగ నిర్మాణాన్ని పార్టీ వ్యవహారంగా కాంగ్రెస్ చూడలేదు. రాజ్యాంగ రూపకల్పనలో ఇతర పార్టీలకు చెందిన నేతలకు, రాజ్యాంగపరమైన అంశాల్లో గట్టి పట్టున్న ప్రముఖులకు సముచిత స్థానం కల్పించింది. రాజ్యాంగ ముసాయిదా రచనా కమిటీ సారథ్యాన్ని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు అప్పగించడమే అందుకు నిదర్శనం.
మహామహుల కృషి
అంబేడ్కర్ తన అసమాన ప్రతిభతో బాధ్యతలను నిర్వహించారు. 300 మంది వరకు రాజ్యాంగ పరిషత్‌లో ఉన్నప్పటికీ కీలక పాత్ర వహించింది 20 మంది మాత్రమే. కాంగ్రెస్ వైపు నుంచి జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, బాబూ రాజేంద్రప్రసాద్ ముఖ్యభూమిక పోషించారు. కెం.ఎం.మున్షీ, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌ల పాత్ర కూడా గణనీయమైందే. రాజ్యాంగ పరిషత్‌కు న్యాయ సలహాదారుగా వ్యవహరించిన బి.ఎన్.రావు, చీఫ్ డ్రాఫ్ట్స్‌మన్‌గా వ్యవహరించిన ఎస్.ఎన్.ముఖర్జీలదీ అద్వితీయ పాత్రే.
సమైక్యతకే అగ్రాసనం
బ్రిటిష్ పాలకులు రూపొందించిన 1935 భారత ప్రభుత్వ చట్టంలోని చాలా విషయాలను భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. ఆధునిక ప్రజాస్వామ్య దేశాల అనుభవాల నుంచి చాలా విషయాలు తీసుకున్నారు. దీంతో రాజ్యాంగంలో భారతీయతను లేకుండా చేస్తున్నారన్న విమర్శలు ఆనాడే వచ్చాయి. గ్రామం ఆలంబనగా వికేంద్రీకరణ పాలనకు మహాత్మా గాంధీ సూచించిన విధంగా రాజ్యాంగం రూపొందాలని కొందరు కోరినా దానికి మద్దతు లభించలేదు. చివరికి వ్యక్తి హక్కుల ఆధారంగానే ఆధునిక రాజ్యాంగాలు రూపొందాయని.. పంచాయతీలకో, అలాంటి ఇతర సంస్థలకో ఆ హక్కులు ఇవ్వడం సమంజసం కాదనే వాదనే నెగ్గింది.
కేంద్ర-రాష్ట్ర సంబంధాలు గురించి చాలా చర్చే జరిగింది. పన్నుల ఆదాయంలో కేంద్రానికే ఎక్కువ అధికారాలు కల్పించడంపై కూడా విమర్శలొచ్చాయి. నిర్దిష్ట అధికారాలతో రాష్ట్రాలకు ప్రత్యేక అస్తిత్వాన్ని కల్పించే సమాఖ్య వ్యవస్థకు అంగీకరించినా జాతి సమైక్యతను కాపాడే వ్యవస్థగా కేంద్ర ప్రభుత్వానికే కీలక విషయాల్లో పెద్దపీట వేశారు. బలమైన కేంద్రం గురించి అంబేడ్కర్ గట్టిగా వాదించారు.