సొంత ప్రాణం మీద తీపి.. సాటి మనిషికి సాయం చేయనీదంటారు! అది, కర్ణాటకలో మరోసారి నిజమైంది. కరోనా వేళ కన్నతండ్రి మృతి చెంది పుట్టెడు దుఃఖంలో ఉన్న ఓ తనయుడికి.. సాయం చేసేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. దీంతో ఆ కుమారుడికి తోపుడు బండే తోడైంది.
తోపుడు బండి మీద తండ్రి శవంతో...
బతికినంత కాలం నలుగురికి నచ్చినట్టు, బంధువులు మెచ్చేట్టు బతకాలంటారు. కానీ, ప్రాణం పోయిన రోజు ఆ నలుగురు కనీసం అంతిమయాత్రలో కూడా తోడు రారని ఎవ్వరైనా ఊహిస్తారా? కానీ, కర్ణాటకలో ఇలాంటి ఘటనే జరిగింది. అనారోగ్యంతో మృతి చెందిన ఓ వ్యక్తి శవయాత్ర నిర్వహించడానికి బంధువులు, ఇరుగుపొరుగు ఎవ్వరూ రాలేదు. దీంతో, కుమారుడే తండ్రి శవాన్ని తోపుడు బండిపై మోసుకెళ్లి ఒంటరిగా అంత్యక్రియలు నిర్వహించాడు.
కర్ణాటక బెళగావి జిల్లా, అథనికి చెందిన సదాశివ.. నెలరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం ప్రాణాలు విడిచాడు. కరోనా భయంతో అంత్యక్రియలు నిర్వహించడానికి చుట్టపక్కలవారు, బంధువులు ముందుకు రాలేదు. దీంతో, తోపుడు బండిపై తండ్రి శవాన్ని పడుకోబెట్టి.. తల్లితో కలిసి శ్మశానం వరకు తోసుకెళ్లాడు తనయుడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మానవత్వం అంతరించిపోయిందా అంటు ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
ఇదీ చదవండి: కేరళలో రెండు చోట్ల కరోనా సామాజిక వ్యాప్తి