ముంబయి మలాడ్లో గోడ కూలిన ఘటన తీరని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 26 మంది మరణించారు. మరో 90 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. అయితే.. ఈ విషాద ఘటనలో ఓ చిన్నారి మృత్యుంజయుడయ్యాడు. త్రుటిలో ప్రాణాల నుంచి బయటపడ్డాడు.
తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న వారి ఇంటి పై గోడ కూలిపోయింది. నివాసంపై ఓ పక్కన గోడ శిథిలాలు, మరోపక్కన నీరు చేరింది. ఆయుష్, అతడి తల్లిదండ్రులు, కొంతమంది పొరుగువాళ్లు నీటిలో కొట్టుకుపోయారు. మరికొంతమంది గోడ శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందారు. ఆ చిన్నారి మాత్రం ప్రాణాలు దక్కించుకున్నాడు. ఎలాంటి గాయాలు కాకుండా ఇంటికి అరకిలోమీటరు దూరంలో పడిఉన్నాడు ఆ పసి బాలుడు.