రెండున్నర దశాబ్దాల పాటు ఏకచ్ఛత్రాధిపత్యం వహించి సిక్కింను పాలించిన సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్(ఎస్‌డీఎఫ్)కు ఇప్పుడు రాష్ట్రంలో ఉనికే లేకుండా పోతోంది. తాజాగా ఆ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు భాజపాలో చేరగా.. బుధవారం మరో ఇద్దరు అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్‌కేఎం) కండువా కప్పుకున్నారు. ఫలితంగా ప్రస్తుత సిక్కిం శాసనసభలో ఎస్‌డీఎఫ్ నుంచి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనే.. పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్.
25ఏళ్ల పాటు అధికారంలో..
పవన్‌కుమార్ చామ్లింగ్.. దేశంలోనే అత్యంత ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత. 1993లో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పేరుతో పార్టీని స్థాపించారు. 1994లో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా ఎస్‌డీఎఫ్ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి వరుసగా ఐదు పర్యాయాలు గెలిచి అధికారాన్ని కొనసాగించింది. సుదీర్ఘంగా 25ఏళ్లు పాటు పవన్ చామ్లింగ్ సీఎంగా పనిచేశారు. సిక్కింలో మొత్తం 32 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. 2004 ఎన్నికల్లో ఎస్‌డీఎఫ్ పార్టీ 31 చోట్ల గెలుపొందింది. 2009 ఎన్నికల్లో అయితే అన్ని స్థానాల్లో గెలిచి క్లీన్‌స్వీప్ చేసింది.
తిరుగుబాటు ఎమ్మెల్యేనే ప్రత్యర్థి..
ఎస్‌డీఎఫ్‌కు చెందిన ప్రేమ్ సింగ్ తమాంగ్ పార్టీలో ప్రముఖ నేత. పవన్ చామ్లింగ్ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. అయితే 2009లో అప్పటి సీఎంపైనే విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు. 2013 ఫిబ్రవరిలో సిక్కిం క్రాంతికారి మోర్చా ఏర్పాటైన తర్వాత ఎస్‌డీఎఫ్‌ను అధికారికంగా వీడి ఎస్‌కేఎంలో చేరారు. అనతి కాలంలోనే పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ప్రేమ్ సింగ్ పార్టీని వీడాక ఎస్‌డీఎఫ్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అప్పటి నుంచి రాష్ట్రంలో శోభను కోల్పోతూ వస్తోంది.