తెలంగాణ

telangana

By

Published : Feb 4, 2019, 11:37 PM IST

ETV Bharat / bharat

సీబీఐ-బంగాల్ వివాదంపై రోజంతా హైడ్రామా...

కీలక మలుపులతో సీబీఐ-బంగాల్​ వివాదం సోమవారం దేశ రాజకీయల్లో ప్రకంపనలు సృష్టించింది.

మమతా బెనర్జీ

కేంద్రం-బంగాల్ ప్రభుత్వం​ మధ్య వైరం మరింత ముదిరింది. ఆదివారం రాత్రి మొదలైన హైడ్రామా గంటగంటకు కీలక మలుపులు తిరుగుతూ సోమవారం తీవ్రరూపం దాల్చింది.

శారదా​ కుంభకోణం కేసులో కోల్​కతా పోలీసు కమిషనర్​ రాజీవ్​ కుమార్​​ను ప్రశ్నించేందుకు ఆదివారం వెళ్లిన సీబీఐ అధికారుల బృందాన్ని కోల్​కతా పోలీసులు అడ్డుకున్నారు. అధికారులు, పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగి, సీబీఐ అధికారులను బలవంతంగా సమీపంలోని పోలీస్​స్టేషన్​కు పోలీసులు తరలించారు. కాసేపటికి వారని విడిచిపెట్టారు.

రాత్రి నుంచి మమత సత్య'ఆగ్రహం':-

దీక్షలో మమత

కేంద్ర తీరుకు వ్యతిరేకంగా ఆదివారం రాత్రి మెట్రో ఛానల్​ వద్ద పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రారంభించిన సత్యాగ్రహం సోమావారం కూడా కొనసాగింది. రాజ్యాంగ పరిరక్షణ జరిగేవరకు తన దీక్ష కొనసాగుతుందని మమత స్పష్టం చేశారు. నిరసనల శాంతియుతంగా జరగాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మమత. తాను చేస్తున్న సత్యాగ్రహానికి వ్యవస్థలతో సంబంధం లేదని, మోదీ ప్రభుత్వ దుశ్చర్యలకు నిరసన మాత్రమేనని స్పష్టం చేశారు మమత.

"నా ప్రాణాలు ఇవ్వడానికైన సిద్ధం. కానీ రాజీపడే ప్రసక్తే లేదు. తృణమూల్​ కాంగ్రెస్​ పార్డీ కార్యకర్తలను హింసించినప్పుడు నేను దీక్ష చేయలేదు. కానీ కోల్​కతా పోలీసు కమిషనర్​ పదవిని అవమానిస్తే సహించేది లేదు."
---- మమతా బెనర్జీ, పశ్చిమబంగ ముఖ్యమంత్రి.

సుప్రీంకోర్టుకు బంగాల్​ వివాదం..

బంగాల్ వివాదం

బంగాల్​ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. శారదా కుంభకోణంలో విచారణకు రాజీవ్​ కుమార్​ సహకరించేలా ఆదేశించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించింది సీబీఐ. ఈ విషయమై రేపు అత్యవసర విచారణ చేపట్టనుంది సర్వోన్నత న్యాయస్థానం.

ఉభయసభల్లో గందరగోళం...

పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలకు బంగాల్​ వివాదం సెగ తగిలింది. పశ్చిమబంగలో కేంద్ర దుశ్చర్యకు నిరసనగా తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ సభ్యులు లోక్​సభ, రాజ్యసభల్లో ఆందోళనలు చేపట్టారు. వీరికి విపక్షాలు మద్దతుగా నిలిచాయి. పలుమార్లు వాయిదా పడ్డ ఉభయసభలు తిరిగి ప్రారంభమైనా గందరగోళం కొనసాగడంతో రేపటికి వాయిదా పడ్డాయి.

సీబీఐను ఆయుధంగా ఉపయోగించుకుని విపక్షాలపై కేంద్రం దాడి చేస్తోందని లోక్​సభలో కాంగ్రెస్​ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు.

ఎన్నికల సంఘం వద్దకు భాజపా...

రక్షణశాఖ మంత్రి నిర్మల సీతారామన్ నేతృత్వంలోని భాజపా బృందం ఎన్నికల సంఘాన్ని కలిసింది. పశ్చిమబంగలో భాజపా కార్యకలాపాలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఈసీకి తెలియజేశారు. ప్రజాస్వామ్యంపై తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీకి విశ్వాసం లేదని విమర్శించారు.

మమతకు అండగా...

పట్టువదలకుండా కేంద్రంపై సత్యాగ్రహం చేస్తోన్న మమతకు విపక్షాలు అండగా నిలిచాయి. 22 పార్టీలు మమతకు మద్దతు తెలిపాయని తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ వర్గాలు తెలిపాయి.

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్​, సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్​ యాదవ్​ దీదీకు తమ మద్దతు ప్రకటించారు.

పశ్చిమబంగ గవర్నర్​తో రాజ్​నాథ్​ చర్చలు...

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై గవర్నర్​ కే ఎన్​ త్రిపాతితో సంభాషించారు కేంద్ర హోం మంత్రి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని రాజ్​నాథ్​ సూచించారు. రాష్ట్ర పరిస్థితులపై రాజ్​నాథ్​కు గవర్నర్​ నివేదిక అందించారు.

ABOUT THE AUTHOR

...view details