ఎన్నికల ఫలితాలతో అన్నం ముట్టని లాలూ! ఎన్డీఏ ప్రభంజనంతో బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) నేతృత్వంలోని మహాకూటమి ఘోర ఓటమి పాలయింది. ఈ ఫలితాలతో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు.
ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన ఆహారం తీసుకోవడం లేదని రాంచీలోని రిమ్స్‌లో లాలూకు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు.
ఆహారం తీసుకోకపోతే వైద్యానికి ఇబ్బంది కలుగుతుందని.. పలుమార్లు తాము వారిస్తే మే 26న భోజనం చేసినట్లు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న వైద్యుడు ఉమేష్ ప్రసాద్ చెప్పారు.
బిహార్‌లో కాంగ్రెస్-ఆర్జేడీ కూటమిలో కాంగ్రెస్‌కు కేవలం ఒక స్థానం దక్కగా, ఆర్జేడీ సున్నాకే పరిమితమైంది. రాష్ట్రంలోని 40 స్థానాలకు గాను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 39 స్థానాలను గెలుచుకుంది.
1997లో ఆర్జేడీ పార్టీ ఆవిర్భవించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో బిహార్‌లో ఒక్క పార్లమెంటు సీటు కూడా గెలవకపోవడం ఇదే మొదటిసారి. ఝార్ఖండ్‌లో వరుసగా రెండోసారి పార్టీ సున్నాకే పరిమితమైంది.
ఎప్పుడూ అందర్ని నవ్విస్తూ.. ఛలోక్తులు విసిరే లాలూ... పశుగ్రాస కుంభకోణం కేసులో ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్నారు. లాలూ లేకుండా.. పార్టీ ఎన్నికలకు వెళ్లడం ఇదే మొదటిసారి. ఆయన భార్య రబ్రీ దేవీ, కుమారుడు తేజస్వీ యాదవ్ ప్రస్తుతం పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎన్నోఏళ్ల పాటు లాలూ ప్రాతినిధ్యం వహించిన సరన్ లోక్‌సభ సీటునూ ఆర్జేడీ ఈసారి గెలవలేకపోయింది.
జనతా దళ్ యునైటెడ్(జేడీయూ), రాష్ట్రీయ జనతా దళ్... ఒకప్పుడు బద్ధశత్రువులు. అనూహ్యంగా 2015 శాసనసభ ఎన్నికల కోసం ఒక్కటయ్యాయి. జట్టుగా పోటీచేసి గెలిచాయి. జేడీయూ-ఆర్జేడీ పొత్తు ఎంతోకాలం కొనసాగలేదు. 2017 జులైలో లాలూతో తెగదెంపులు చేసుకున్నారు బిహార్ సీఎం నితీశ్ కుమార్. తిరిగి ఎన్డీఏలో చేరారు.