మహారాష్ట్రలో అధికారం చేపట్టడానికి శివసేన.. ఎన్సీపీ మద్దతు కోరనుందా అనే అనుమానాలకు తావిస్తున్నాయి తాజా రాజకీయ పరిణామాలు. భాజపాతో ముఖ్యమంత్రి పీఠంపై సందిగ్ధత నెలకొన్నందున.. ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో పొత్తు కోసం సేన ప్రయత్నిస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటికి బలం చేకూర్చేలా తాజాగా ఓ సంఘటన జరిగింది. శివసేన పార్టీ నేత సంజయ్ రౌత్ నుంచి తనకు సందేశం వచ్చిందని ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ వెల్లడించారు.
ఎన్సీపీ నేతకు శివసేన సందేశం..మద్దతు కోసమా? సంజయ్ రౌత్ నుంచి వచ్చిన సందేశాన్ని మీడియా సమావేశంలో చదివి వినిపించారు అజిత్ పవార్. రౌత్ సందేశానికి స్పందనగా తానే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడతానన్నారు.
'నమస్కారం నేను సంజయ్ రౌత్, జై మహారాష్ట్ర.. అని రౌత్ సందేశం పంపారు. దీని అర్థం నేను ఆయనకి ఫోన్ చేయాలని. ఫోన్ చేసి విషయమేంటో కనుక్కుంటా.'- అజిత్ పవార్, ఎన్సీపీ సీనియర్ నేత.
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై భాజపా, శివసేన మధ్య సయోధ్య కుదరడం లేదు. తాము ప్రతిపక్షంలోనే ఉంటామని ఎన్సీపీ ఇదివరకే స్పష్టం చేసింది. అయితే తాజా రాయకీయాల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశం కానున్నారు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్. వీరి భేటీ తర్వాత శివసేనకు మద్ధతిచ్చే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తమకు 170 ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఈరోజు రౌత్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చను లేవనెత్తాయి. శివసేనకు కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతిస్తాయా అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.