తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహాలో కొలువుదీరనున్న ప్రభుత్వం.. నేడే ఠాక్రే ప్రమాణం

మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ సర్కార్ నేడు కొలువు తీరనుంది. ముఖ్యమంత్రిగా ఈ రోజు సాయంత్రం శివసేనాని ఉద్ధవ్​ ఠాక్రే ప్రమాణస్వీకారం చేస్తారు. ఇందుకోసం ముంబయిలోని శివాజీ పార్క్​లో ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖనేతలతో పాటు మహారాష్ట్రలో ఆత్మహత్య చేసుకున్న 400 మంది రైతుల కుటుంబాలను ఆహ్వానించింది శివసేన.

నేడే ఠాక్రే ప్రమాణం
నేడే ఠాక్రే ప్రమాణం

By

Published : Nov 28, 2019, 5:10 AM IST

Updated : Nov 28, 2019, 9:48 AM IST

మహాలో కొలువుదీరనున్న ప్రభుత్వం.. నేడే ఠాక్రే ప్రమాణం

మహారాష్ట్రలో శివసేన, ఎన్​సీపీ, కాంగ్రెస్‌తో కూడిన మహా వికాస్‌ అఘాడీ సర్కార్‌ ఏర్పాటుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్దవ్‌ఠాక్రే.. నేడు ప్రమాణం చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం 6:40 గంటలకు దాదర్‌లోని శివాజీ పార్క్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధాని నరేంద్రమోదీని ఠాక్రే కోరారు.

రైతు కుటుంబాలకు ఆహ్వానం

ప్రమాణ స్వీకారానికి దేశంలోని ముఖ్యనేతలతో పాటు మహారాష్ట్రలో ఆత్మహత్యలు చేసుకున్న 400 మంది రైతు కుటుంబాలను ఆహ్వానించింది శివసేన.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ను ఆహ్వానించింది శివనేన. పార్టీ యువనేత ఆదిత్య ఠాక్రే ప్రత్యేకంగా దిల్లీ వెళ్లి వీరిద్దరినీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా కోరారు.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బంగాల్‌, దిల్లీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌ను ఆహ్వానించినట్లు మహారాష్ట్ర వికాస్‌ అఘాడీ నేతలు తెలిపారు. అయితే ముందే ఖరారైన అధికారిక కార్యక్రమాల దృష్ట్యా కేజ్రీవాల్​ రాకపై అనుమానాలు నెలకొన్నాయి.

ఉద్ధవ్​కు గవర్నర్​ లేఖ

ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఉద్ధవ్‌ ఠాక్రే... గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీతో ఉదయం సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత ఉద్ధవ్‌కు లేఖ రాసిన గవర్నర్‌.. గురువారం నిర్ణయించిన సమయానికి ప్రమాణ స్వీకారం చేయించనున్నట్టు తెలిపారు. అయితే బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లో శాసనసభ లేదా శాసన మండలికి ఎన్నిక కావాలని, వారంలోపు అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని ఉద్ధవ్ ఠాక్రేకు గవర్నర్‌ సూచించారు.

ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్!

ఠాక్రేతో పాటు నేడు మంత్రులుగా ఎవరు ప్రమాణం చేస్తారనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో కలకలానికి కారణమైన ఎన్సీపీ నేత అజిత్​ పవార్​ కూటమి తరఫున ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే కాంగ్రెస్​కు స్పీకర్​, ఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రి, ఉప సభాపతి పదవులు కేటాయించినట్లు ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ స్పష్టం చేశారు. ఠాక్రేతో పాటు మరో ఇద్దరు నేతలు మంత్రులుగా ప్రమాణం చేస్తారని ఆయన తెలిపారు.

పదవుల పంపకాలు

మహా వికాస్‌ అఘాడీ కూటమి భాగస్వామ్య పక్షాలు.. పదవుల పంపకంపై దృష్టి సారించాయి. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, మల్లికార్జున ఖర్గే... ఎన్​సీపీ అధినేత శరద్ పవార్‌తో సమావేశమై మంత్రి పదవులపై చర్చించారు. అనంతరం శరద్‌పవార్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి ఉద్దవ్‌ఠాక్రేను కలిసి కాంగ్రెస్‌, ఎన్​సీపీ నేతల మధ్య జరిగిన భేటీకి సంబంధించిన వివరాలను పంచుకున్నారు.

మొత్తానికి శివసేనకు కేబినెట్‌లో 16 బెర్తులు, ఎన్​సీపీకి 15, కాంగ్రెస్‌కు సహా 13 మంత్రి పదవులు దక్కనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు దక్కే 13 బెర్తుల్లో 9 కేబినెట్‌, 4 సహాయ మంత్రి పదవులు ఉన్నట్టు తెలుస్తోంది. అసవరమైతే స్పీకర్‌ పదవిని వదులుకునేందుకు కాంగ్రెస్‌ సంసిద్ధత వ్యక్తంచేసినట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఇదీ చూడండి: కాంగ్రెస్​-శివసేన-ఎన్​సీపీ కూటమిపై అమిత్ షా ఫైర్​

Last Updated : Nov 28, 2019, 9:48 AM IST

ABOUT THE AUTHOR

...view details