కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పుస్తకం 'ఏ ప్రామిస్డ్ ల్యాండ్'లో కీలక వ్యాఖ్యలు చేయటంపై స్పందించింది శివసేన. రాహుల్కు మద్దతుగా నిలిచింది. ఒబామాకు భారత్ గురించి ఏమాత్రం తెలుసు? అని ప్రశ్నించారు శివసేన నేత సంజయ్ రౌత్. భారతీయ రాజకీయ నాయకులపై ఒక విదేశీ రాజకీయ నాయకుడు అలాంటి అభిప్రాయాలు వెల్లడించటం సరికాదని సూచించారు.
"ఒక విదేశీ రాజకీయ నాయకుడు భారత రాజకీయ నేతలపై అలాంటి అభిప్రాయాలు వెల్లడించకూడదు. ఒబామా వ్యాఖ్యల తదనంతరం దేశీయ నేతల ప్రసంగం చాలా అసహ్యంగా ఉంది. ట్రంప్ పిచ్చివాడని మేము ఎప్పటికీ వ్యాఖ్యానించం. ఈ దేశం గురించి ఒబామాకు ఎంత మాత్రం తెలుసు?"
- సంజయ్ రౌత్, శివసేన నేత
ఏ ప్రామిస్డ్ ల్యాండ్ పేరుతో ఒబామా పుస్తకం రాశారు. అందులో వివిధ దేశాల నేతల గురించి ప్రస్తావించారు. పని పూర్తిచేసి ఉపాధ్యాయుడి మెప్పును పొందాలని విద్యార్థి ఎలా ఆరాటపడతారో అలాంటిదే తప్పిస్తే ప్రావీణ్యం సంపాదించాలనే తపన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలో లేదని వ్యాఖ్యానించారు ఒబామా. స్పష్టత గానీ, ధైర్యం గానీ ఆయనలో కనిపించదన్నారు.
ఒబామా వ్యాఖ్యలతో భారత్లో రాజకీయ దుమారం చెలరేగింది. కాంగ్రెస్ తమ నేతను సమర్థించుకోవటానికి ప్రయత్నించింది. 'ఒబామా, రాహుల్ గాంధీలు చాలా తక్కువ సందర్భాల్లో కలుసుకున్నారు. 10 ఏళ్ల క్రితం అధ్యక్ష హోదాలో భారత్ వచ్చినప్పుడు, కొన్ని సమావేశాల్లో చూసి ఒకరిని అంచనా వేయటం కఠినమైన విషయం. అప్పటి నుంచి రాహుల్ గాంధీ వ్యక్తిత్వం మారిపోయింది. ఆయన చాలా అనుభవాన్ని పొందారు' అని పేర్కొన్నారు కాంగ్రెస్ నేత తరిక్ అన్వర్.
ఇదీ చూడండి:ఆ తపన రాహుల్లో లేదు: ఒబామా