హిందీ రగడ: షా వర్సెస్ ప్రాంతీయ పార్టీలు హిందీ భాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. హిందీ భాష.. దేశాన్నంతా ఐక్యం చేస్తుందని వ్యాఖ్యానించారు అమిత్ షా. మాతృ భాషతో సమానంగా హిందీని ఉపయోగించాలని ఉద్ఘాటించారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందేందుకు దేశం మొత్తానికి ఒకే భాష ఉండటం అవసరమని స్పష్టం చేశారు.
అమిత్షా వ్యాఖ్యలను విపక్షాలు తప్పుపట్టాయి.
'మాతృ భాష కంటే ఎక్కువ కాదు...'
ప్రజలు అన్ని భాషలను గౌరవించాలని, కానీ మాతృ భాష కంటే ఎక్కువగా కాదని అన్నారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను మరువకూడదని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
'షా వ్యాఖ్యలు సరికాదు..'
దేశాన్ని హిందీ ఐక్యం చేస్తుందన్న అమిత్షా వ్యాఖ్యలను తప్పుబట్టారు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్. హిందీని బలవంతంగా రుద్దడంపై పోరాడుతూనే ఉన్నామన్నారు. అమిత్షా వ్యాఖ్యలు దేశ ఐక్యతను దెబ్బతీసేవిగా ఉన్నాయని మండిపడ్డారు స్టాలిన్. షా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. త్వరలో పార్టీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి... షా వ్యాఖ్యలపై ఎలా ముందుకెళ్లాలనే అంశమై చర్చిస్తామని తెలిపారు డీఎంకే సారథి.
'దక్షిణాది భావాలను గౌరవించండి'
షా వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తంచేశారు పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి. తమిళ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నందున అమిత్షా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు.
ఇదీ చూడండి: 'దేశాన్ని ఐక్యం చేసే శక్తి 'హిందీ' సొంతం'