కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భారత్ మొత్తం లాక్డౌన్లో కాలం గడుపుతోంది. రోజులో 24 గంటలు ఇంట్లోనే ఉండటం వల్ల ఒకరితో ఒకరు సమయాన్ని గడిపేందుకు కుటుంబాలు పాత పంథాను ఎంచుకున్నాయి. ఇంటర్నెట్లో షార్ట్ ఫిలింస్, టీవీ షోస్, పుస్తకాలు చదవడం అలవాటు ఉన్న ఈ తరానికి మళ్లీ నాటి క్లాసిక్ గేమ్స్ రుచి చూపిస్తున్నారు పెద్దలు.
గంటల తరబడి కుటుంబ సభ్యులు చదరంగంపై యుద్ధం చేస్తున్నారు. రాణిని సొంతం చేసుకోవడానికి క్యారంబోర్డుపై కుస్తీలు పడుతున్నారు. లాక్ డౌన్ సమయం అంతా విసుగ్గా గడపకుండా కొత్త మార్గాల్లో చిన్నచిన్న ఆనందాలను వెతుక్కుంటున్నారు.
ఒక్కో అక్షరాన్ని పేర్చుకుంటూ పదాలను రూపొందించే స్క్రాబుల్ గేమ్, చైనీస్ చెకర్, క్యారంబోర్డ్, చెస్, జిగ్సావోతోపాటు ఆన్ లైన్ లో ఆడే స్క్రిబుల్, డూమ్ ఎటర్నల్ వంటి యాక్షన్ గేమ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అటకమీద ఉన్న వైకుంఠపాళీ(పాము నిచ్చెన) పటాల దుమ్ము దులుపుతున్నారు. నిత్యావసరాలు అమ్మే దుకాణాల్లోనూ వీటి కొనుగోలుకు ఎగబడుతున్నారు.