కరోనా కారణంగా ఈ ఏడాది పూరీ జగన్నాథుడి రథయాత్రపై నెలకొన్న ప్రతిష్టంభనపై నేడు స్పష్టత రానుంది. ఈనెల 23న మంగళవారం నుంచి రథయాత్ర ప్రారంభ కావాల్సి ఉన్నా.. ఈనెల 18న స్టే విధించింది సుప్రీం కోర్టు. ఈ నేపథ్యంలో.. రద్దుఆదేశాలను సవరించి అనుమతులు ఇవ్వాలని పలువురు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై నేడు విచారణ చేపట్టనుంది జస్టిస్ ఎస్. రవీంద్ర భట్ నేతృత్వంలోని ధర్మాసనం.
లక్షలాది మంది భక్తులు పాల్గొంటూ, మత విశ్వాసాలకు అతీతమైన ఉత్సవాలను రద్దు చేయడం ఆచరణ యోగ్యంకాదని 'జగన్నాథ్ సంస్కృతి జన జాగారణ్ మంచ్' పేరిట వ్యాజ్యం దాఖలైంది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పునః సమీక్షించుకోవాలని కోరారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర, జిల్లా పాలకుల ఆధ్వర్యంలో భౌతిక దూరం పాటిస్తూ రథయాత్ర నిర్వహించేందుకు అనుమతినివ్వాలని పేర్కొన్నారు.
12 ఏళ్లపాటు..
ఈ ఏడాది రథయాత్ర జరగకపోతే.. వచ్చే 12 ఏళ్లపాటు నిర్వహించకూడదని మరో పిటిషనర్ పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కనీసం భక్తులు లేకుండా నిర్వహించేందుకైనా అనుమతులు ఇవ్వాలని కోరారు.