తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నాయకుల ఎన్నిక రద్దు పార్లమెంట్​ పరిధిలోనిదే' - leaders crime records

కోర్టుల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల ఎన్నికను రద్దు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని దాఖలైన వ్యాజ్యాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ అంశం పూర్తిగా పార్లమెంట్​ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది.

SC refuses to entertain plea seeking to declare as void election of those facing criminal charges
'నాయకుల ఎన్నిక రద్దు పూర్తిగా పార్లమెంట్​ పరిధిలోనిది'

By

Published : Nov 17, 2020, 7:01 AM IST

న్యాయస్థానాల్లో నేర అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల ఎన్నికను రద్దు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ఓ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఆ అంశం పూర్తిగా శాసన సంబంధ వ్యవహారమని, అది పార్లమెంటు పరిధిలోకి వస్తుందని పేర్కొంది. ఐదు లేదా అంత కన్నా ఎక్కువ సంవత్సరాల కారాగార శిక్ష పడే ఆస్కారమున్న నేరాలకు సంబంధించి, అభియోగ పత్రాల్లో ఏడాది కన్నా ఎక్కువ కాలం పాటు పేరున్న ఎంపీలు, ఎమ్మెల్యేల ఎన్నికను రద్దు చేయాలంటూ 'లోక్​ పహారి' ఎన్జీవో ప్రతినిధి ఎస్‌ఎన్‌ శుక్లా ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌-100ను అనుసరించి అభియోగాలు ఎదుర్కొంటున్న చట్టసభ్యుల ఎన్నికను రద్దు చేయొచ్చంటూ పిటిషనర్‌ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఆ సెక్షన్‌లో పేర్కొన్న నిబంధనలు ఎన్నికల ప్రక్రియకు సంబంధించినవని, దీనిపై పార్లమెంటే చర్యలు తీసుకోవాలని ధర్మాసనం తెలిపింది.

పిటిషనర్‌ చేసిన అభ్యర్థనను పరిగణించాలంటే ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణ చేయాల్సి ఉంటుందని, దానిపై పార్లమెంటుకే అధికారం ఉందని స్పష్టం చేసింది. శాసన సంబంధ వ్యవహారాలపై తాము ఎలాంటి తీర్పులు ఇవ్వలేమని వెల్లడించింది. అయితే తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్నవారు రాజకీయాల్లోకి ప్రవేశించకుండా చట్టాలు చేయాల్సిన బాధ్యత పార్లమెంటుదే అంటూ సుప్రీం కోర్టు 2018లో ఇచ్చిన తీర్పు అమలయ్యేలా పిటిషనర్‌ కృషి చేయవచ్చని సూచించింది.

ఇదీ చూడండి: పట్టపగ్గాల్లేని నేర రాజకీయం- ఈసీ బాధ్యతేంటి?

ABOUT THE AUTHOR

...view details