భారత న్యాయవ్యవస్థ చరిత్రలో మరో సంచలనం. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. 22 మంది సుప్రీం న్యాయమూర్తులకు.. ఆరోపించిన మహిళ పంపిన ప్రమాణపత్రం శనివారం బహిర్గతమైంది. వెంటనే సుప్రీంకోర్టు ధర్మాసనం అత్యవసర విచారణ చేపట్టింది.
ఈ ఆరోపణల వెనుక అతిపెద్ద శక్తి ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం అభిప్రాయపడింది. వచ్చేవారం కీలకమైన కేసుల విచారణ ఉన్నందునే తనపై ఆరోపణలు చేస్తున్నారని సీజేఐ తెలిపారు. మాజీ ఉద్యోగి ఆరోపణలపై జస్టిస్ రంజన్ గొగొయి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.
"ఆరోపణలు నన్నెంతో బాధించాయి. ఇవన్నీ నిరాధారం. 4 మీడియా సంస్థలు ఈ కథనాలు ప్రచురించాయి. ఆయా సంస్థల నుంచి నాకు ఈ విషయంపై సమాచారం అందింది. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు పెను ముప్పు పొంచి ఉంది. న్యాయవ్యవస్థను అస్థిరపరిచేందుకు పెద్ద కుట్ర జరుగుతోంది. ఆరోపణలు చేసిన మహిళ వెనుక శక్తిమంతమైన వారు ఎవరో ఉన్నారు.
ఈ ఆరోపణలు నమ్మశక్యంగా లేవు. వాటిని ఖండించడానికి నా స్థాయి తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని నేను భావించడంలేదు. 20ఏళ్లు న్యాయమూర్తిగా పనిచేసినా నా బ్యాంకు బ్యాలెన్స్ రూ. 6.80లక్షలు మాత్రమే. డబ్బు విషయంలో నన్ను ఎవరూ దోషిగా చూపలేక కొందరు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.
ఈ వ్యవహారం వెనుక ఏదో పెద్ద శక్తి ఉంది. సీజేఐ కార్యాలయాన్నే వారు నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. 20ఏళ్లు సేవలందించాక భారత ప్రధాన న్యాయమూర్తికి లభించే బహుమానం ఇదేనా? నేను ఈ పదవిలోనే కొనసాగుతా. ఎలాంటి భయం లేకుండా నా విధులు నిర్వర్తిస్తా. న్యాయవ్యవస్థ బలి పశువు కారాదు."
- జస్టిస్ రంజన్ గొగొయి, భారత ప్రధాన న్యాయమూర్తి
ఈ విషయంలో మీడియా విజ్ఞత పాటించాలని కోరిన ధర్మాసనం.. న్యాయవ్యవస్థ స్వతంత్రతపై ఎలాంటి ప్రభావం పడబోదన్నారు. న్యాయవ్యవస్థ అత్యంత తీవ్రమైన బెదిరింపులు ఎదుర్కొంటోందన్న ధర్మాసనం ఇది అత్యంత దయనీయమైన పరిస్థితి అని వ్యాఖ్యానించింది. నీతినియమాలు లేని ఆరోపణలతో భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని నీరుగార్చేందుకు ఓ పెద్దశక్తి ప్రయత్నం చేస్తోందని ధర్మాసనం పేర్కొంది.
ఈ ధర్మాసనంలో సీజేఐతో పాటు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నా సభ్యులుగా ఉన్నారు. ఈ వ్యవహారంలో ఆదేశాలు జారీచేసే అంశాన్ని జస్టిస్ అరుణ్ మిశ్రాకు విడిచిపెడుతున్నట్లు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.