15 రోజుల్లో కూలీల్ని స్వస్థలాలకు చేర్చండి: సుప్రీం - 15 రోజుల్లో వలసకూలీలను స్వస్థలాలకు చేర్చాలి: సుప్రీం
10:54 June 09
వలసకూలీల అంశంపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు
దేశంలో వలసకూలీలను గుర్తించి వారిని 15 రోజుల్లో స్వస్థలాలకు పంపాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. వలసకూలీల అంశాన్ని సుమోటోగా తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం.. విచారణ జరిపి మధ్యంతర తీర్పును వెలువరించింది.
జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, ఎం.ఆర్.షాల త్రిసభ్య ధర్మాసనం... రాష్ట్ర ప్రభుత్వాలు అడిగిన 24 గంటల్లో శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వలసకూలీలకు ఉపాధి కల్పించేందుకు... రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలు హెల్ప్‌డెస్కులు ఏర్పాటుచేయాలని సూచించింది. అలాగే వలసకూలీలపై నమోదు చేసిన లాక్డౌన్ ఉల్లంఘన కేసులను ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది.
కరోనా సంక్షోభం, లాక్డౌన్ల వల్ల వలసకూలీలు ఉపాధి కోల్పోయారు. స్వస్థలాలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు వలసకూలీల అంశాన్ని సుమోటోగా తీసుకుని విచారణ జరిపింది.