దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా నిర్ధరణ సహా సంబంధిత పరీక్షలు ఉచితంగా చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్‌ల్లో ఉచితంగా కొవిడ్ - 19 పరీక్షలు నిర్వహించాలని స్పష్టంచేసింది.
కరోనా నిర్ధరణ పరీక్షలకు రూ.4500 ఖర్చవుతుందని ఇటీవల ప్రభుత్వం ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దిల్లీకి చెందిన ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబరేషన్ ల్యాబరేటరీస్ (ఎన్‌ఏబీఎల్) గుర్తింపు పొందిన ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు చేయాలని తెలిపింది. అలాగే, డబ్ల్యూహెచ్‌ఓ, ఐసీఎంఆర్ గుర్తింపు పొందిన ఏజెన్సీల ద్వారా పరీక్షలు నిర్వహించాలని సూచించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు పరీక్షల ఫీజులు భారం కాకూడదు అన్న ఉద్దేశంతో ఉచితంగానే పరీక్షలు నిర్వహించేలా రాష్ట్రాలకు తక్షణమే ఆదేశాలు ఇవ్వాలని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రైవేటు ల్యాబ్‌లలో చేసే కరోనా పరీక్షలకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే రీఎంబర్స్ చేసే విధానాన్ని పరిశీలించాలని సూచించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసేందుకు కేంద్రానికి రెండు వారాలు గడువు ఇస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
పరీక్ష కిట్లను అందుబాటులో ఉంచాలి..
కొవిడ్-19 పరీక్షల కోసం చేసే పీపీఈ పరీక్ష కిట్లను ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలని ప్రభుత్వానికి సూచించింది సుప్రీంకోర్టు. వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి రక్షణ కల్పించాలని వెల్లడించింది. వైద్య సిబ్బంది విధులకు ఆటంకం కలిగిస్తున్న వారిని నియంత్రించే దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది.
ఇదీ చూడండి:బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి.. లేదంటే అరెస్టే!