హాథ్రస్ హత్యాచార ఘటన దిగ్భ్రాంతికరమని, ఈ ఘోరంపై పదే పదే వాదనలు వినాలనుకోవడం లేదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. హాథ్రస్ ఘటనపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ కేసులో సాక్షులకు ఎలాంటి రక్షణ కల్పిస్తున్నారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బాధిత కుటుంబం న్యాయవాదిని ఏర్పాటు చేసుకుందా, లేదా అని అడిగింది. దీనిపై బుధవారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే తాము గురువారం అఫిడవిట్ దాఖలు చేస్తామని యూపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనితో తదుపరి విచారణను న్యాయస్థానం వచ్చే వారానికి వాయిదా వేసింది.
యూపీ వాదనలు ఇలా..
అంతకుముందు యూపీ ప్రభుత్వం వాదనలు వినిపించింది. హాథ్రస్ కేసులో ఎన్నో అవాస్తవ కథనాలు వినిపిస్తున్నాయని, వాటిని అరికట్టాలని యూపీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టును కోరారు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి వదంతులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. వీటిని అరికట్టేలా హాథ్రస్ కేసుపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు.
మరోవైపు ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. ఎలాంటి అల్లర్లు, ఘర్షణలు జరగకుండా ఉండేందుకే మృతురాలి అంత్యక్రియలను అర్ధరాత్రి నిర్వహించాల్సి వచ్చిందని అందులో పేర్కొంది.
ఇదీ చూడండి:'హాథ్రస్ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించండి'