తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కశ్మీర్​లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించండి'

జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కశ్మీర్​లో సత్వరమే సాధారణ పరిస్థితులు పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం, జమ్ముకశ్మీర్​ అధికారులను ఆదేశించింది సుప్రీం కోర్టు. అధికరణ 370 రద్దు, ఆంక్షలను సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనల అనంతరం తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.

సుప్రీం కోర్టు

By

Published : Sep 16, 2019, 12:20 PM IST

Updated : Sep 30, 2019, 7:35 PM IST

'కశ్మీర్​లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించండి'

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు, కశ్మీర్​లో ఆంక్షలు, సమాచార వ్యవస్థ స్తంభనపై దాఖలైన అన్ని రకాల పిటిషన్లపై విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కశ్మీర్​లో క్రమపద్ధతిలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు సత్వరం అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, జమ్ముకశ్మీర్​ అధికారులను ఆదేశించింది.

లోయలో జనజీవనాన్ని సాధారణ స్థితికి రావడమే కాకుండా అన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలు పొందేలా చర్యలు చేపట్టాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

సమాచార వ్యవస్థ స్తంభన అనేది కశ్మీర్​లోయలోనే ఉన్నందున ఈ అంశాన్ని జమ్ముకశ్మీర్​ హైకోర్టు పరిశీలిస్తుందని అభిప్రాయపడింది ధర్మాసనం. జమ్ముకశ్మీర్​లో సమాచార వ్యవస్థపై ఆంక్షలు ఎత్తివేయాలని కశ్మీర్​ టైమ్స్​ ఎగ్జిక్యూటివ్​ ఎడిటర్​ అనురాధ భాసిన్​ దాఖలు చేసిన పిటిషన్​ మేరకు ఈ వ్యాఖ్యలు చేసింది కోర్టు.

అధికరణ 370 రద్దు చేసినప్పటి నుంచి ఒక్క తూటా పేల్చకుండా చర్యలు తీసుకున్నట్లు కోర్టుకు తెలిపారు ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లోనే ఆంక్షలు ఉన్నాయని.. 88 శాతం పోలీస్టేషన్ల పరిధిలో ఆంక్షలు ఎత్తివేశామని తెలిపారు. కశ్మీర్​లో ప్రచురితమయ్యే అన్ని వార్తాపత్రికలు నడుస్తున్నాయని.. అందుకు అన్ని రకాల సహాయం అందిస్తున్నామన్నారు. వాటితో పాటు దూరదర్శన్​, ఇతర ప్రైవేటు టీవీ ఛానళ్ల, ఎఫ్​ఎం నెట్​​వర్క్​లు పనిచేస్తున్నట్లు తెలిపారు.

అఫిడవిట్​ దాఖలుకు ఆదేశం..

కశ్మీర్​లో సాధారణ పరిస్థితులు కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో అఫిడవిట్​ దాఖలు చేయాలని అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​ను ఆదేశించింది సుప్రీంకోర్టు.

కశ్మీర్​లో పర్యటిస్తా...

కశ్మీరీ ప్రజలు హైకోర్టును ఆశ్రయించలేకపోతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో నివేదిక సమర్పించాలని జమ్ముకశ్మీర్​ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించింది సుప్రీం ధర్మాసనం. అలాంటి పరిస్థితులు ఉంటే తీవ్రంగా పరిగణించాలని పేర్కొన్నారు జస్టిస్​ గొగొయి. ఒకవేళ అదే పరిస్థితి ఉంటే తాను శ్రీనగర్​లో పర్యటిస్తానని తెలిపారు. ఈ వాదనలకు నివేదిక విరుద్ధంగా వస్తే దాని పర్యవసానాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆరోపణలు చేసిన న్యాయవాదిని హెచ్చరించారు.

ఆజాద్​కు అనుమతి...

జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్​కు శ్రీనగర్​, బారముల్లా, అనంతనాగ్​, జమ్ము జిల్లాల్లో పర్యటించేందుకు అనుమతించింది సుప్రీం కోర్టు. ప్రజలను కలిసి వారి సంక్షేమం గురించి తెలుసుకోవచ్చని పేర్కొంది. ఈ పర్యటనలో ఎలాంటి ప్రసంగాలు చేయకూడదని, బహిరంగ సభలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది.

వైగో వ్యాజ్యంపై కేంద్రానికి నోటీసులు..

జమ్ము కశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్​ అబ్దుల్లాను కోర్టు ముందు ప్రవేశపెట్టాలన్న ఎండీఎంకే అధినేత వైగో వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారించింది. ఈ విషయంలో సమాధానం ఇవ్వాలని కేంద్రంతో పాటు జమ్ము ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈనెల 30లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం.

ఆర్టికల్​ 370 రద్దును సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది ధర్మాసనం.

ఇదీ చూడండి: చేతి అల్లికలతో మహిళల గిన్నీస్ రికార్డు

Last Updated : Sep 30, 2019, 7:35 PM IST

ABOUT THE AUTHOR

...view details