అక్రమార్జన కేసులో సుప్రీంకోర్టు విధించిన రూ.10 కోట్ల జరిమానాను అన్నాడీఎంకే మాజీ కార్యదర్శి, తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ చెల్లించారు. ప్రస్తుతం బెంగళూరు జైలులో ఉన్న శశికళ తరఫున.. ఆమె న్యాయవాదులు ఈ మొత్తాన్ని చెల్లించినట్లు తెలిపారు.
ఈ మొత్తాన్ని బెంగళూరు సిటీ సివిల్ కోర్టు కార్యాలయంలో డిమాండ్ డ్రాఫ్టుల ద్వారా అందజేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని ఓ రాజకీయ నేత ఏర్పాటు చేసినట్లు సమాచారం.
నాలుగేళ్ల శిక్ష..
అక్రమార్జన కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. బెంగుళూరు పరప్పణ అగ్రహారం జైలులో ఆమె శిక్ష అనుభవిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 వరకూ ఆమె జైలుశిక్ష అనుభవించాల్సి ఉన్నప్పటికీ సత్ప్రవర్తన తదితర కారణాల వల్లే జనవరి 27న ఆమెను విడుదల చేసే అవకాశం ఉందని కర్నాటక జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు.
ఈ కేసులో శశికళతో పాటు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా ఉన్నారు. ఇందులో జయలలితకు రూ.100 కోట్లు, శశికళ సహా ఇతరులకు రూ.10 కోట్లు జరిమానా విధిస్తూ 2014 సెప్టెంబర్లో ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది.
ఇదీ చూడండి:జనవరిలో చిన్నమ్మ రిలీజ్- అన్నాడీఎంకేలో గుబులు!