భారతీయ వ్యాపారవేత్త, ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ (38)పై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. ఆయన భార్య ప్రియా బన్సల్ బెంగళూరులోని కోరమంగళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దంత వైద్యురాలైన ప్రియ ..బెంగళూరులో ఓ వైద్యశాలను నిర్వహిస్తోంది. బన్సల్ దంపతులకు పదేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు.
తమ వివాహ సమయంలో తన తండ్రి రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేశారని.. కారు కొనుగోలు చేసేందుకు సచిన్‌కు రూ.11 లక్షల మొత్తాన్ని అందచేశారని ప్రియా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆస్తులను తన పేరు మీదకు బదిలీ చేయాల్సిందిగా సచిన్ తనపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను అందుకు నిరాకరించడం వల్ల.. సచిన్ తల్లిదండ్రులు, సోదరుడు తనను వేధిస్తున్నారన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు సచిన్ బన్సల్‌తో పాటు ఆయన తండ్రి సత్‌ప్రకాశ్ అగర్వాల్, తల్లి కిరణ్ బన్సల్, సోదరుడు నితిన్ బన్సల్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.