దేవస్థానాలకు విరాళాలు, కానుకలు ఇవ్వటం మత సంప్రదాయమే అయినా.. ఆ మొత్తాలను ఉగ్రవాదం లేదా కేసినో నడిపేందుకు ఉపయోగిస్తే.. అలాంటి చర్యలను చట్టం నియంత్రిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. పురాతన సంప్రదాయాలు బలి, సతీ చట్టప్రకారం హత్యలే అని.. మతాచారాల పేరుతో వాటిని అడ్డుకోకుండా ఉండలేమని తెలిపింది.
'మతాచారాల పేరిట తప్పు చేస్తే.. చట్టం నియంత్రిస్తుంది' - సుప్రీంకోర్టు
విరాళాలు, కానుకల రూపంలో దేవస్థానాలకు అందే సొమ్ములను ఉగ్రవాదానికి ఉపయోగిస్తే చట్టం నియంత్రిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 'మత స్వేచ్ఛ, ఒక మతానికి చెందిన వ్యక్తి మరో మతానికి చెందిన సంప్రదాయాలను ప్రశ్నించవచ్చా' అనే అంశాలను పరిశీలిస్తున్న సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ. బోబ్డే నేతృత్వంలోని 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. 'మత స్వేచ్ఛ, ఒక మతానికి చెందిన వ్యక్తి మరో మతానికి చెందిన సంప్రదాయాలను ప్రశ్నించవచ్చా' అనే అంశాలను పరిశీలిస్తోంది. శబరిమల కేసులో తీర్పు నుంచి ఈ ప్రశ్నలు తలెత్తాయి. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం బలి, సతీ కూడా హత్యలే. ఇవి మతపరమైన అంశాలే అయినప్పటికీ.. సంస్కరించాల్సి ఉంటుందని జస్టిస్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ శాంతనగౌడర్, జస్టిస్ నజీర్, జస్టిస్ సుభాష్‌రెడ్డి, జస్టిస్ గవాయ్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. మతపరమైన సంప్రదాయలు అయినప్పటికీ.. విరాళాలు, శుభ్రత, ఆరోగ్యం అంశాలు చట్టం పరిధిలోకి వస్తాయని ధర్మాసనం తేల్చిచెప్పింది.
ఇదీ చూడండి:-'కంబళ వీరుడు' శ్రీనివాస గౌడకు సీఎం సత్కారం