తెలంగాణ

telangana

By

Published : Aug 18, 2019, 5:58 AM IST

Updated : Sep 27, 2019, 8:47 AM IST

ETV Bharat / bharat

కశ్మీర్​లో టెలిఫోన్​, అంతర్జాల సేవలు పునరుద్ధరణ

జమ్ము కశ్మీర్​లో కొన్ని సున్నిత ప్రాంతాల్లో మినహా మిగతాచోట్ల ఆంక్షలు సడలించింది ప్రభుత్వం. కశ్మీర్​లోని 35 పోలీస్​స్టేషన్ల పరిధిలో టెలిఫోన్ సేవలు, జమ్ములో 5 జిల్లాల్లో 2-జీ ఇంటర్నెట్​ సేవలు పునరుద్ధరించారు అధికారులు. అన్ని ప్రాంతాల్లోనూ కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతోంది.

కశ్మీర్​ : ఆంక్షల సడలింపు.. టెలిఫోన్​ సేవలు పునరుద్ధరణ

కశ్మీర్​లో టెలిఫోన్​, అంతర్జాల సేవలు పునరుద్ధరణ

ఆర్టికల్​ 370 రద్దుకు ముందు కశ్మీర్​లో విధించిన ఆంక్షలను 12 రోజుల తరువాత ప్రభుత్వం సడలించింది. అయితే కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో మాత్రం ఆంక్షలు కొనసాగనున్నాయి. కశ్మీర్​ లోయలోని 35 పోలీస్​స్టేషన్ల పరిధిలో టెలిఫోన్​ సేవలను అధికారులు పునరుద్ధరించారు.

శ్రీనగర్​ సహా పలు ప్రాంతాల్లో భద్రతా బలగాలు బారికేడ్లు పెట్టినప్పటికీ... ప్రజల రాకపోకలను అనుమతిస్తున్నారు. సివిల్​ లైన్స్​ ప్రాంతంలోని కొన్ని దుకాణాలు తెరుచుకున్నందున ప్రైవేటు వాహనాల రద్దీ పెరిగిందని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ వాణిజ్య సంస్థలు, పెట్రోల్​ బంకులు మూసే ఉన్నాయి.

అంతర్జాల సేవలు అందుబాటులోకి...

జమ్ములో ఇప్పటికే ఆంక్షలను ఎత్తివేసిన అధికారులు.. అక్కడ 2-జీ ఇంటర్నెట్​ సేవలు కూడా అందుబాటులోకి తెచ్చారు. శ్రీనగర్​లోని సివిల్​లైన్స్, కంటోన్మెంట్​, విమానాశ్రయం, రాజ్​బాగ్​, జవహర్​నగర్​లో... టెలిఫోన్ సేవలు పునరుద్ధించారు. అయితే వాణిజ్య కేంద్రం లాల్​చౌక్​, ప్రెస్​ ఎన్​క్లేవ్​ల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి.

"కశ్మీర్​లోని పలు ప్రాంతాలకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 96 టెలిఫోన్​ ఎక్స్ఛేంజ్​లకుగాను 17 పనిచేస్తున్నాయి. రేపు సాయంత్రానికి సున్నితమైన ప్రాంతాల్లో మినహాయించి లోయలోని అన్ని టెలిఫోన్​ ఎక్స్ఛేంజ్​లు పనిచేస్తాయని ఆశిస్తున్నాం. మేము పాఠశాలలను తెరవడంపై దృష్టిసారించాం. సోమవారం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిగా పనిచేస్తాయి."
- రోహిత్ కన్సాల్​, జమ్ము కశ్మీర్​ ముఖ్యకార్యదర్శి

'సోమవారం నుంచి 190 ప్రాథమిక పాఠశాలలను ప్రారంభిస్తాం. 10 రోజులుగా పాఠశాలలు మూత పడినందున విద్యార్థులకు అదనపు తరగతులూ నిర్వహిస్తామని' అధికారులు తెలిపారు.

రాజకీయ నాయకుల విడుదల ఎప్పుడంటే..

స్థానిక అధికార యంత్రాంగం శాంతి భద్రతలను సమీక్షించిన తరువాతనే నిర్బంధంలో ఉన్న రాజకీయ నాయకులను విడుదల చేస్తామని జమ్ము కశ్మీర్ డీజీపీ దిల్​బాగ్​ సింగ్​ తెలిపారు.

నకిలీ సందేశాలు ప్రచారం చేశారో జాగ్రత్త

కశ్మీర్​ లోయలో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించిన నేపథ్యంలో.. సామాజిక మాధ్యమాల్లో నకిలీ విద్వేషపూరిత సందేశాలు లేదా వీడియోలను ప్రసారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

శాంతి కొందరికి ఇష్టం లేదు..

జమ్ము కశ్మీర్​లో శాంతి నెలకొనడం కొంత మందికి ఇష్టం లేదన్నారు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్​. అయితే అక్కడ పరిస్థితి సాధారణస్థితికి చేరుకుంటోందని ఆయన అన్నారు.

ఇదీ చూడండి: 48 రోజుల తర్వాత 40 ఏళ్ల విశ్రాంతికి స్వామివారు!

Last Updated : Sep 27, 2019, 8:47 AM IST

ABOUT THE AUTHOR

...view details