కశ్మీర్లో పోస్టర్ల కలకలం... శ్రీనగర్‌లో మళ్లీ ఆంక్షలు క్రమక్రమంగా పరిస్థితులు మెరుగుపడుతున్న కశ్మీర్లో మళ్లీ ఆంక్షలు విధించారు. శ్రీనగర్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయానికి భారీ ప్రదర్శనగా తరలిరావాలని వేర్పాటువాదులు పిలుపునివ్వడమే కారణం.
అధికరణ 370 రద్దుకు నిరసనగా ప్రదర్శన చేయాలని జాయింట్ రెసిస్టెన్స్ లీడర్షిప్(జేఎల్ఆర్) సమ్మేళనం పేరిట పలు ప్రాంతాల్లో గోడ పత్రికలు వెలిశాయి. రాష్ట్రంలో కేంద్రం అల్లకల్లోలం సృష్టిస్తోందంటూ వేర్పాటువాదులు విమర్శించారు.
అప్రమత్తమైన సైన్యం...
గోడ పత్రికల నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తును పటిష్ఠం చేశారు అధికారులు. ఐరాస కార్యాలయం ఉన్న లాల్ చౌక్, సోనావర్ ప్రాంతాల్లో సిబ్బందిని భారీగా మోహరించారు. బారికేడ్లు, ముళ్లకంచెలను ఏర్పాటుచేశారు.
కశ్మీర్లో 18 రోజులుగా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. రవాణా వ్యవస్థ క్రమక్రమంగా మెరుగుపడింది. అయితే.. అంతర్జాల సేవలపై మాత్రం నిషేధాజ్ఞలు ఉన్నాయి.
ఇదీ చూడండి:గాంధీ 150: రూ.500 ఉప్పు వేలంతో స్వాతంత్ర్య పోరాటం