తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సరైన నేతల్ని ప్రజలకు చూపే బాధ్యత మీదే: ఉపరాష్ట్రపతి - vice president

నేతల పనితీరును బహిర్గతం చేసి ఓటర్లకు సహకరించాలని మీడియా సంస్థలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. ఈ సమాచారంతో సరైన నాయకులను ఎన్నుకునే స్వేచ్ఛ ప్రజలకు లభిస్తుందని వెంకయ్య అభిప్రాయపడ్డారు.

సరైన నేతల్ని చూపే బాధ్యత మీదే: ఉపరాష్ట్రపతి

By

Published : Mar 20, 2019, 9:26 PM IST

రాజకీయ నాయకుల పనితీరును ప్రజలకు తెలియజేయాలని మీడియా సంస్థలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. అప్పుడే సరైన ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు వారికి స్వేచ్ఛ లభిస్తుందని వ్యాఖ్యానించారు. అభ్యర్థుల గత చరిత్ర, పార్లమెంట్, శాసనసభ చర్చల్లో పాల్గొన్నవిధానాన్ని ప్రజలకు తెలియజెప్పాలన్నారు.

హామీలపై ప్రశ్నించాలి

దిల్లీలోని 'భారత మాస్ కమ్యూనికేషన్' సంస్థ నిర్వహించిన అటల్ బిహారీ వాజ్​పేయీ మొదటి స్మారక ఉపన్యాసంలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. ప్రచార హామీలపై మీడియా కీలక పాత్ర పోషించాలి. వాగ్దానాల సాధ్యాసాధ్యాలపై ప్రశ్నించాలని వెంకయ్య కోరారు.

ఓటు.. పౌరుల విధి

ఓటుపై విస్తృత ప్రచారం కల్పించి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి బలమైన పునాదులు పడేలా ప్రోత్సహించాలని వెంకయ్య నాయుడు సూచించారు. ఓటు పౌరులందరి విధి. ప్రతి ఎన్నికల్లో ఓటు వేయడమనేది అలవాటుగా మారాలని ఆకాంక్షించారు.

"తమకిష్టమైన అభ్యర్థిని ఎన్నుకునేలా ఓటు హక్కును వినియోగించుకోవటమే ప్రజాస్వామ్య ఎన్నికల ప్రధాన లక్ష్యం. ఇది సక్రమంగా జరగాలంటే స్వేచ్ఛ, స్వతంత్ర మీడియాతోనే సాధ్యమవుతుంది. మీరు (మీడియా సంస్థలు) దీనికి కొంత సమయం కేటాయించాలి. పార్టీ ఫిరాయింపులతో ప్రజాస్వామ్యం భవిష్యత్తు అంధకారంలో పడిపోతోంది. పార్టీ మారితే పదవికి రాజీనామా చేయాల్సిందే."
-వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి

లక్షణాల బేరీజు

ఒక అభ్యర్థికి ఓటువేసేటప్పడు అతని స్వభావం, సామర్థ్యం, ప్రవర్తన వంటి విషయాలను బేరీజు వేసుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు. ప్రస్తుతం ఈ లక్షణాలకు బదులుగా డబ్బు, సామాజిక వర్గం, నేరస్థులకు ప్రాధాన్యమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికల సమయంలో మీడియా పాత్ర కీలకం. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందితే ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీడియాపైనే ఉంటుందన్నారు వెంకయ్య. నిష్పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే ఓటర్లలో అవగాహన పెరుగుతుందని ఆకాంక్షించారు.

"ఎలాంటి భయం లేకుండా అభిప్రాయాలు చెప్పాలి. అయితే మన అభిప్రాయంతో నిజాలను మార్చలేము."
-వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి

ABOUT THE AUTHOR

...view details