తెలంగాణ

telangana

By

Published : Aug 24, 2019, 7:00 AM IST

Updated : Sep 28, 2019, 1:54 AM IST

ETV Bharat / bharat

ఆర్థిక స్వేచ్ఛకు గాంధీ చెప్పిన సిద్ధాంతాలు ఇవే

మహాత్మా గాంధీ లక్ష్యాలు రెండు. ఒకటి దేశ దాస్య శృంఖలాలు తెంచడం. అందుకు ఆయన ఎంచుకున్న మార్గం.. అహింస, శాంతియుత పోరాటం. స్వాతంత్య్రం తర్వాత దేశ ప్రజలందరూ ఆర్థిక స్వేచ్ఛ పొందడం గాంధీజీ లక్ష్యాలలో రెండోది. ఇందుకు ఆయన ఎంచుకున్న మార్గం సామ్యవాద సమ్మిళితమైన ఆర్థిక వ్యవస్థ. బాపూజీ చెప్పిన ఆర్థిక విధానాలు తెలుసుకుందాం.

ఆర్థిక స్వేచ్ఛకు గాంధీ చెప్పిన సిద్ధాంతాలు ఇవే

మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని.. బాపూజీ నడిపించిన స్వాతంత్య్ర ఉద్యమాన్ని, ఆయన జీవన విధానాన్ని దేశం గుర్తుచేసుకుంటోంది. దేశ స్వతంత్ర సంగ్రామంలో గాంధీజీ అహింసా యోధుడిగా కనిపిస్తారు. అయితే.. ఆర్థిక రంగంలోనూ మాహాత్ముడు తనదైన ప్రణాళికలు వేశారు.

స్వతంత్రం వచ్చిన తర్వాత అనివార్యంగా చేయాల్సి వచ్చిన పారిశ్రామికీకరణ, ఆ తర్వాత దూసుకువచ్చిన సంస్కరణలు.. ఈ దేశం గాంధీజీ ఆర్థిక విధానాలను పాటించలేని పరిస్థితులు కల్పించాయి. పారిశ్రామికీకరణ, సంస్కరణలు సమాజంలో అసమానతలను మరింత పెంచాయి. గాంధీజీ కలలు కన్న ఆర్థిక సమానత్వం సాధ్యం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో.. గాంధీజీ ఆర్థిక భావజాలాన్ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గాంధీజీ ఆర్థిక భావజాలం:

మహాత్ముడి ఆర్థిక విధానాలు ఆదర్శవాదమనే భావన ఉంది. అందరూ సమానమే అనే సామ్యవాదాన్ని కలిగిన సరళమైన విధానమే.. గాంధీజీ ఆర్థిక భావజాలం. పరస్పర విరుద్ధమైన అంశాల కలయికతో సాగే ఆర్థికాభివృద్ధి అది. విలువలు - వ్యాపారం, అభివృద్ధి - సమానత్వం, సంపద సృష్టి- పంపిణీ.. ఇవన్నీ ఒకదానికొకటి వ్యతిరేక పదాలుగా కనిపిస్తాయి. విలువల గల వ్యాపారం చేయడం కష్టమనుకుంటాం. అసమానతలను పెంచే అభివృద్ధినే చూస్తున్నాం. కళ్ళు మిరుమిట్లు గొలిపే సంపదతో కలిగిన కుటుంబాలు ఓ వైపు, ఆకలి చావులు మరోవైపు.

ప్రపంచంలో ఏ ఆర్థిక విధానాన్ని పరిశీలించినా ఇదే దృశ్యం కనిపిస్తోంది. గాంధీజీ ఆర్థిక భావజాలం మాత్రం ఇందుకు పూర్తి భిన్నం.

మహాత్ముడి ఆర్థిక భావజాలంలో.. పనిచేసే అందరికీ సమాన అవకాశాలున్న ఆర్థిక వ్యవస్థ కనిపిస్తుంది. అవసరం లేనప్పటికీ కొనుగోలు చేసే వినియోగ ఆర్థిక విధానాలకు గాంధీజీ వ్యతిరేకం. అందుకే ఆయన విలాసవంతమైన జీవితాన్ని ఎప్పుడూ సమర్థించలేదు. సరళమైన జీవనమే సరైన జీవితమని గాంధీజీ భావించారు. పారిశ్రామికీకరణను గాంధీజీ వ్యతిరేకించారు. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు.. వ్యవసాయం, కుటీర పరిశ్రమలను అభివృద్ధి పరచడంపై దృష్టి పెట్టాలని ఎన్నోసార్లు స్పష్టంచేశారు.

ఆ రోజుల్లో దేశంలో.. వ్యవసాయంపై ప్రజలు ఎక్కువగా ఆధారపడ్డారు. రైతులు, కూలీలు, శ్రామిక వర్గ ప్రయోజనాలను గాంధీజీ అర్థం చేసుకున్నారు. అధిక జనాభాగల దేశంలో.. ఎక్కువమంది ఆధారపడిన రంగాలకు సరైన ప్రాముఖ్యత లేకుండా ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దడం సరికాదన్నది మహాత్ముడి విధానం.

ఇది ఇప్పుడు సరిపోతుందా..?

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థలు ఏకీకృతమైపోయాయి. నయా ఉదారవాద ఆర్థిక విధానాలు పరుగులు పెడుతున్నాయి. ఆర్థిక, వాణిజ్య విధానాలు ప్రపంచీకరణకు మద్దతిస్తున్నాయి. ఇవన్నీ గాంధీజీ ఆర్థిక భావజాలానికి పూర్తి వ్యతిరేకం.

స్వాతంత్య్రం అనంతరం పాటించిన ఆర్థిక విధానాలు భారత ఆర్థిక వ్యవస్థ స్వరూప స్వభావాన్ని మార్చాయి. ఇవి గాంధీజీ ఆర్థిక భావజాలం నుంచి దేశాన్ని వేరు చేశాయి. గాంధీజీ ప్రియ శిష్యుడైన తొలి భారత ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూనే ఈ నిర్ణయాలు తీసుకున్నారు. పారిశ్రామికీకరణకు గాంధీజీ వ్యతిరేకం కాగా.. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం.. రెండో పంచవర్ష ప్రణాళిలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు పెద్దపీట వేశారు. జనాభా భారం, భారీ సంఖ్యలో పేదలు, నిరక్షరాస్యులు ఉండటం, దేశవిభజన సమయంలో మత పరమైన అల్లర్లు, బ్రిటీష్‌ పాలనలో దోపిడీకి గురికావడంలాంటి నేపథ్యంలో.. పారిశ్రామికీకరణ అనివార్యమైంది.

ఇన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల.. ఆదర్శవాద ఆర్థిక నమూనా అమలు సాధ్యం కాలేదు. సంపద అన్ని వర్గాలకు సమానంగా అందాలని గాంధేయ ఆర్థిక భావజాలం చెబుతుంది. కానీ.. సంపద ఉంటేనే కదా.. పంపీణీ జరిగేది. అందుకే స్వాతంత్య్రం అనంతరం సంపద సృష్టించేందుకు పారిశ్రామికీకరణవైపు మొగ్గు చూపాల్సి వచ్చింది. ఆ తర్వాత కాలంలో ఆర్థిక సవాళ్లు ఎదురయ్యాయి. నిజం చెప్పాలంటే తీవ్రమయ్యాయి. చివరకు దేశాన్ని మార్కెట్‌ శక్తులు నియంత్రించే సరళీకరణ, ప్రైవేటీకరణ, గ్లోబలైజేషన్‌ వైపు నడిపించారు. వీటికి సంస్కరణలు అనే పేరు పెట్టారు. ఈ విధానమైన వైఖరితో దేశ ఆర్థిక వ్యవస్థ గాంధీ ఆర్థిక భావజాలం నుంచి బలవంతంగా వేరయింది. ఇలా తొలిసారి పారిశ్రామికీకరణతో, రెండోసారి సంస్కరణలతో గాంధీజీ ఆర్థిక విధానాలను దేశం పాటించలేకపోయంది.

ఈ ప్రక్రియలో, వ్యవసాయ రంగానికి కంటే ఐటీ లాంటి సేవల పరిశ్రమకు ప్రాధాన్యం లభించింది. భారతీయ సగటు సాధారణ జీవితాన్ని వినియోగ మనస్తత్వం భర్తీ చేసింది. చిన్న తరహా పరిశ్రమలపై బహుళ జాతి కంపెనీల ఆధిపత్యం పెరిగింది. దేశ స్వాతంత్య్రం కోసం గాంధీజీ జీవితమంతా కష్టపడ్డారు. కానీ.. స్వాతంత్య్రం అనంతరం దేశ ప్రజలు ఎలాంటి ఆర్థిక స్వేచ్ఛ పొందాలనుకున్నారో అది మాత్రం జరగలేదు.

దుష్ఫలితాలు...

ఈ సంస్కరణల తర్వాత అసమానతలు తీవ్రమయ్యాయి. గ్రామాల్లో పరిస్థితులు మరింత దిగజారాయి. పల్లెల నుంచి నగరాలకు భారీ సంఖ్యలో వలసలు పెరిగాయి. 45 ఏళ్ళలో నిరుద్యోగిత రేటు అత్యధికంగా పెరిగింది. వ్యవసాయం సంక్షోభంలో పడింది. పేదరికం ఇప్పటికీ కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్న పిల్లలలో 30. 3 శాతం మంది చిన్నారులు భారత్‌లోనే ఉన్నారు.

సబ్ సహారాన్‌ ఆఫ్రికా తర్వాతి స్థానంలో మనదేశమే ఉందని.. యునిసెఫ్‌, అంతర్జాతీయ కార్మిక సమాఖ్య సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక స్పష్టం చేస్తోంది. మరోవైపు వేతనాల్లో వృద్ధి లేదు, ధరలు నియంత్రణలో ఉండటం లేదు. వ్యవసాయ రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఖర్చులు పెరుగుతున్నాయి. అన్ని కష్టాలకోర్చి పంట పండిస్తే కనీస మద్దతు ధర దొరకడం లేదు. ఈ పరిస్థితులతో వ్యవసాయమంటే అదో దండగమారి వ్యవహారం అన్నట్లుగా మారింది.

రాష్ట్రాల మధ్య ఆదాయ అసమానతలు పెరిగిపోతున్నాయి. . సమస్యలు మారాయి... కానీ తీవ్రత అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే మరింత పెరిగింది. ఈ పరిస్థితుల్లోనే గాంధేయ ఆర్థిక భావజాలం మరింత ప్రాముఖ్యత చూపుతుంది. సంపదను సృష్టించి పంపిణీ చేసే సామ్యవాదం, నీతి, సమానత్వంతో ఈ సవాళ్ళను పరిష్కరించే మార్గాలుగా కనిపిస్తాయి. గాంధేయ ఆర్థిక విధానం వల్ల సామాజిక శాంతి వెల్లివిరుస్తుంది.

5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ...

అందువల్ల గాంధేయ ఆర్థిక విధానాలు.. ఇప్పటికీ పాటించదగినవే. 2025 నాటికి మన ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి చేరాలనే ప్రణాళికలు వేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో.. గాంధేయ ఆర్థిక విధానాల దృక్పథాన్ని అర్థం చేసుకోవాలి. వ్యవసాయం, గ్రామీణ పరిశ్రమలు కేంద్ర బిందువుగా గల.. గాంధీజీ ఆర్థిక వృద్ధిరేటు నమూనా ప్రస్తుత పరిస్థితులకు పరిష్కారం చూపగలదు. ముఖ్యంగా.. పస్తుతం గ్రామీణ దుస్థితి, వ్యవసాయ సంక్షోభానికి అదే దారిచూపుతుంది.

ఈ విధానంలో.. భారీ పరిశ్రమలు, బహుళజాతి కంపెనీలను మూసివేయలనడం లేదు. ఇది మన ఇంటిని చక్కదిద్దుకోవడంలాంటిది. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ భారతదేశానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే సమయం ఆసన్నమైనది.

గాంధేయ విధానాలు నిస్సంకోచంగా దృఢమైనవి, కఠినమైనవి. క్షేత్రస్థాయిలో వాస్తవిక సమాజ పరిస్థితులు ఆర్థిక వ్యవస్థ ఒత్తిళ్ళు దృష్టిలో పెట్టుంకుంటే వీటి అమలు సాధ్యం కాదనిపిస్తుంది. కానీ.. గాంధీజీ విధానాలు.. సామాజిక శాంతితో పాటు.. దేశ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ఓ దారి చూపుతాయి. గాంధీ జన్మించిన 150 ఏళ్ళ తర్వాత కూడా ఆయన మనకు ఎందుకు గుర్తున్నారంటే అందుకు కారణం ఆయన విధానాలే.

- డా. మహేంద్ర బాబు కురువా, హెచ్​ఎన్​బీ గడ్వాల్​ విశ్వవిద్యాలయం ఆచార్యులు

Last Updated : Sep 28, 2019, 1:54 AM IST

ABOUT THE AUTHOR

...view details