మమతా బెనర్జీ సర్కారుకు, ఆ రాష్ట్ర గవర్నర్‌కు మధ్య రోజుకొక వివాదం నడుస్తోంది. వీటికి స్వస్తి పలికేందుకు.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ఖర్ స్పష్టం చేశారు.
సతీసమేతంగా ఈ రోజు అసెంబ్లీకి వెళ్లిన గవర్నర్... డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అసెంబ్లీ మార్షల్, కొంత మంది ఎమ్మెల్యేలు ఆయనకు స్వాగతం పలికారు. అయితే స్పీకర్ బీమన్ బెనర్జీ రాకపోవడం గమనార్హం. ఆయన వాణిజ్య సలహా కమిటీ భేటీలో ఉన్న కారణంగానే రాలేదని అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి. అనంతరం రాజ్‌భవన్, ప్రభుత్వానికి మధ్య నడుస్తోన్న వివాదంపై గవర్నర్ స్పందించారు.
"ముందుకు సాగాలంటే చర్చలు ఒకటే మార్గం. అన్ని విషయాలపై ముఖ్యమంత్రితో ఎక్కడైనా చర్చించేందుకు నేను సిద్ధం. చర్చకు వేదికగా రాజ్‌భవన్ లేదా నబన్నా (ముఖ్యమంత్రి కార్యాలయం) ఏదైనా ఫర్వాలేదు. ఈ మేరకు మమతా బెనర్జీకి నేను లేఖ రాశాను. మంగళవారం, ఫోన్ లోనూ మాట్లాడాను."
- జగదీప్ ధన్ఖర్, బంగాల్ గవర్నర్
నిన్న శాసనసభ సందర్శనకు వెళ్లిన గవర్నర్‌కు చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీలోకి ప్రముఖులు ప్రవేశించేందుకు ఉద్దేశించిన 3వ నెంబరు గేటుకు సిబ్బంది తాళం వేశారు. కాసేపు ఎదురుచూసిన గవర్నర్... అధికారులు, మీడియా ప్రతినిధులకు కేటాయించిన 4వ నెంబరు గేటులో నుంచి లోపలకు వెళ్లారు. నేడు మాత్రం 3వ నెంబరు గేటు ద్వారా అసెంబ్లీకి వెళ్లారు ధన్ఖర్.