కౌటిల్యుడికే కొత్త కిటుకులు నేర్పగల రసవత్తర రాజకీయ కళాకౌశల ప్రదర్శన మహారాష్ట్ర వేదికపై మహా రంజుగా సాగిపోయింది. రాజకీయాల్లో, క్రికెట్లో కడనిమిషం దాకా గెలుపెవరిదో చెప్పలేమన్న నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు ఎంత నిజమో- పూర్తిగా కొలువుతీరకుండానే పట్టుమని నాలుగు రోజుల్లో కుప్పకూలిన ఫడణవీస్ ప్రభుత్వం ప్రత్యక్షంగా రుజువు చేసింది. మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) పేరిట త్రిపక్ష కూటమి కట్టిన శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఉద్ధవ్ ఠాక్రేను తమ నేతగా ఎన్నుకొని, కనీస ఉమ్మడి కార్యక్రమానికి తుది మెరుగులు దిద్దుతున్న దశలో- 22వ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచి మర్నాటి ఉదయం ఎనిమిది గంటల్లోపు మరాఠా రాజకీయం దిగ్భ్రాంతకర మలుపులు తిరిగింది. 54 మంది సభ్యులుగల ఎన్‌సీపీ శాసనసభాపక్ష నేత అజిత్ పవార్‌ను గుట్టుగా ‘ఆపరేషన్ ఆకర్ష్’తో ఆకట్టుకున్న కమలం పార్టీ- రాష్ట్రపతి పాలన ఎత్తివేతకు సిఫార్సు, ఆమోదం, గవర్నర్ పిలుపు, ప్రమాణ స్వీకార తతంగం అంతటినీ యుద్ధప్రాతిపదికన కానిచ్చేసింది.
అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ఫడణవీస్ పునరధికారానికి రాగలిగినా- వద్దకు చేరి మద్దతిచ్చి ప్రభుత్వాన్ని నిలబెట్టే స్థాయిలో ఎన్‌సీపీలో చీలిక రాకపోవడం, నేటి సాయంత్రం అయిదు గంటల్లోపు బలపరీక్ష పూర్తి కావాలని ‘సుప్రీం’ న్యాయపాలిక ఆదేశించడంతో కాడీ మేడీ పడేయడం తప్ప కమలనాథులకు గత్యంతరం లేకపోయింది. ఎమ్మెల్యేల బేరసారాలవంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు చాపచుట్టి, సుస్థిర ప్రభుత్వానికి ప్రోది చేయడంద్వారా అనిశ్చితికి తెర దించాలన్న జస్టిస్ ఎన్‌వీ రమణ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశాల నేపథ్యంలో- అజిత్ పవార్ రాజీనామా చేసి నిష్క్రమించడం భాజపాకు శరాఘాతమైంది. ఎంవీఏ సర్కారు ఏర్పాటుకు వడివడిగా రంగం సిద్ధమవుతుంటే- సైద్ధాంతిక సారూప్యం లేని త్రిపక్ష కూటమి ఏ మేరకు సుస్థిర పాలన అందించగలదన్న సందేహాలు ముప్పిరిగొంటున్నాయి!
అనుకున్నది ఒక్కడి అయినది ఒక్కటి
ఎదిరి పక్షాల్లో చీలికలే పదవీ పీఠానికి నిచ్చెనమెట్లు అవుతాయంటే, అలాంటి అధికారం తనకు అక్కర్లేదని పదమూన్నాళ్ల ప్రధానిగా 1996లో వాజపేయీ సమున్నతాదర్శానికి గొడుగు పట్టారు. అధికారం కైవసం చేసుకొనే క్రమంలో ఏ అడ్డదారైనా దొడ్డదారేనని తీర్మానించేసుకొన్న సమకాలీన రాజకీయాల్లో ఆ తరహా సైద్ధాంతిక విలువలు- అక్షరాలా చెల్లని కాసులు! అక్టోబరు 21 నాటి మహారాష్ట్ర ఎన్నికల్లో 25.7 శాతం ఓట్లు, 105 సీట్లతో ఏకైక పెద్దపార్టీగా ఆవిర్భవించిన భాజపాతో పాలక కూటమి భాగస్వామిగా పోటీ చేసిన శివసేన 56 స్థానాల్లో విజయం సాధించింది. సాధారణ మెజారిటీ కంటే అధికంగా సీట్లు గెలుచుకొన్న ఆ పాలక కూటమిలో- ముఖ్యమంత్రి పీఠం సహా చెరిసగం పదవీపంకాలు కావాలంటూ శివసేన పెట్టిన పేచీ రాజకీయ అనిశ్చితికి, రాష్ట్రపతి పాలనకు దారితీసింది. ముఖ్యమంత్రి పదవికోసం అర్రులు చాస్తున్న శివసేన- ఎన్‌సీపీ ద్వారా కాంగ్రెస్ మద్దతు సాధనకూ చేసిన యత్నాలు ఫలిస్తుండటం కమలం పార్టీని గంగవెర్రులు ఎత్తించింది.