దేశ రాజధాని దిల్లీలోని అనధికారిక కాలనీల్లో నివాసముండే 40 లక్షల మందికి యాజమాన్య హక్కులు కల్పించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ రాంలీలా మైదానంలో నేడు బహిరంగ సభ జరగనుంది. మోదీకి కృతజ్ఞతగా 11 లక్షలమంది లబ్ధిదారుల సంతకాలతో కూడిన ప్రతిని అందజేయనున్నారు. ఈ సభకు ప్రధాని మోదీ సహా ముఖ్యనేతలు హాజరుకానున్నారు.
భద్రత కట్టుదిట్టం
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శుక్రవారం ఆందోళనలు జరిగిన దర్యాగంజ్ ప్రాంతానికి కిలోమీటరు సమీపంలోనే సభ జరగనున్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. దిల్లీ పోలీసులు, ఎస్పీజీ బలగాల నేతృత్వంలో బహుళ అంచె భద్రత వ్యవస్థ ఏర్పాటు చేశారు. సభావేదిక వద్దకు వెళ్లే అన్ని మార్గాలలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. వదంతులు వ్యాప్తి చేయకుండా సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించనున్నారు.
ఇదీ చూడండి: మలేషియా ప్రధాని వ్యాఖ్యలను తిప్పికొట్టిన భారత్