ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అయోధ్యలోని రామమందిర నిర్మాణ పనులు ఈ మధ్యే మొదలయ్యాయి. ఆలయ ఖర్చు ఎంత అవుతుందనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఈ అద్భుత నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందన్న అంచనాలను ఆలయ ట్రస్ట్ విడుదల చేసింది. దాదాపు రూ.1100కోట్ల ఖర్చు అవుతుందని లెక్కతేల్చింది. అంతేకాదు ఆలయ నిర్మాణానికి మూడున్నరేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని వెల్లడించింది.
రామాలయ నిర్మాణంలో భాగంగా.. ఆలయ పునాదులు, నమూనాలపై ఇంజనీర్లు, నిపుణులు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరీజీ మహరాజ్ వెల్లడించారు. రామ మందిర ప్రధాన ఆలయ నిర్మాణానికే దాదాపు రూ.300 నుంచి రూ.400 కోట్ల ఖర్చు అయ్యే అవకాశం ఉందని అంచనా వేశామన్నారు. ఇక మొత్తం ఆలయ ప్రాంగణంతో కలిపితే ఈ ఖర్చు రూ.1100 కోట్లకు తక్కువ కాదని ముందస్తు అంచనా వేసినట్లు వివరించారు. ఇప్పటివరకు ఆన్‌లైన్ ద్వారా రూ.వంద కోట్లకుపైగా విరాళాలు వచ్చాయని వెల్లడించారు. దీంతో పాటు దాదాపు 4 లక్షల గ్రామాల్లో 11 కోట్ల కుటుంబాల దగ్గరకు వెళ్తామని.. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఆలయ నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని.. ఇందులో ఐఐటీ బాంబే, దిల్లీ, మద్రాస్, గుహవాటి, సీబీఆర్‌ఐ, రూర్కీతో పాటు ఎల్‌అండ్‌టీ, టాటా గ్రూప్‌నకు చెందిన ఇంజనీర్లు నిర్మాణ ప్రణాళికలను రూపొందించడంలో నిమగ్నమయ్యారని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ పేర్కొంది.