అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఏర్పాటైన రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జులై 18న భేటీ కానుంది. మందిర నిర్మాణానికి సంబంధించి భూమిని చదును చేసిన తర్వాత వివిధ దశలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. అయితే ప్రధాని నరేంద్రమోదీ ఒకసారి ఇక్కడికి వస్తే నిర్మాణం మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ అన్నారు.
ఈ భేటీకి సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నట్లు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఆలయ స్తంభాలకు పునాది రాళ్లు వేసే విషయమై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయమై వాస్తుశిల్పులతో ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రాతో కలిసి రాయ్ సమావేశమయ్యారు.