దేశమంతా కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తున్న వేళ.. పలు రాష్ట్రాలు రాజ్యసభ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అన్నీ కలిపి బరిలో ఉన్నది 18 స్థానాలే అయినా.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పార్టీల మధ్య పోటీ తీవ్రస్థాయిలోనే ఉంది. కర్ణాటకలో నాలుగు సీట్లు ఇప్పటికే ఏకగ్రీమవగా.. ఎన్నికల నేపథ్యంలో రాజస్థాన్, గుజరాత్లో మరోమారు రిసార్టు రాజకీయాలు తెరపైకి వచ్చాయి. తమ అభ్యర్థులను పెద్దలసభలో అడుగు పెట్టించేందుకు అధికార, ప్రతిపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి.
పార్లమెంటు ఎగువసభలోని మొత్తం 245 స్థానాల్లో.. నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారుకు ప్రస్తుతం 106 స్థానాలు ఉన్నాయి. ప్రతిపక్షాలు 118 సీట్లతో ముందంజలో ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏవి 57 స్థానాలు కాగా.. ఇతర పార్టీలవి 61 సీట్లు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే కీలక బిల్లులు పార్లమెంటులో గట్టెక్కాలంటే.. సదరు బిల్లులు ఉభయసభల్లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. లోక్సభలో సొంతంగానే పూర్తి మెజారిటీ ఉన్న భాజపాకు.. రాజ్యసభలో మాత్రం బిల్లులను గట్టెక్కించాలంటే ఇతర పార్టీల మద్దతు తప్పనిసరి అవుతోంది. అందుకే జూన్ 19న 18 స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో వీలైనన్ని సీట్లు సొంతం చేసుకుని రాజ్యసభలోనూ తమ మద్దతు పెంచుకోవాలని చూస్తోంది కమలదళం.
గుజరాత్-4, ఆంధ్రప్రదేశ్-4, రాజస్థాన్-3, మధ్యప్రదేశ్-3, ఝార్ఖండ్-2, మణిపుర్, మేఘాలయల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు వరకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.
ఈ 18 స్థానాలకు మార్చి 26నే ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడ్డాయి.
గుజరాత్లో వేడెక్కిన రాజకీయాలు
భాజపా పాలిత గుజరాత్లో.. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా రిసార్టు రాజకీయాలు మొదలయ్యాయి. ఎన్నికల తేదీ ఖరారైన అనంతరం ముగ్గురు కాంగ్రెస్ నేతలు రాజీనామా చేయడం కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.. ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించారు. గుజరాత్లో మొత్తం 4 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.