మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రల్లో పెనుగాలులకు తోడైన వర్షాల ధాటికి మరణించిన వారి సంఖ్య 50కి చేరింది. ప్రచండ గాలుల వీస్తున్న కారణంగా వేల కొద్దీ చెట్లు నేలకూలాయి. రాజస్థాన్, గుజరాత్‌లలో భారీగా ఆస్తి, పంట నష్టం జరిగింది. అకాల వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది.
మృతుల్లో అత్యధికంగా రాజస్థాన్‌కు చెందినవారే 21 మంది ఉన్నారు. రెండు రోజుల్లో మధ్యప్రదేశ్‌లో 15 మంది, గుజరాత్లో 10 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో ముగ్గురు వర్షాలకు బలయ్యారు. భారీ సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగింది.
వర్షాల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడ్డ వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం అందించాలని ప్రధాని నరేంద్రమోదీ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి జాతీయ విపత్తు నిధి కింద ఈ మొత్తాన్ని అందజేయాలని స్పష్టం చేశారు.