లాక్‌డౌన్ నిబంధనల సడలింపులో భాగంగా రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. మంగళవారం నుంచే ఈ రైళ్లు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు రైల్వేశాఖ అనేక సూచనలు చేసింది. అయినా ప్రయాణీకుల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏసీ బోగీల్లో ప్రయాణించేవారికి కరోనా వైరస్ వ్యాప్తిస్తుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలా ఎన్నో అనుమానాలు. రైల్వేశాఖ వీటిపై స్పష్టత ఇచ్చింది.
ఏసీ కోచ్‌ల్లో ప్రయాణించడం వల్ల కరోనా వ్యాపించదని తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
"సెంట్రలైజ్డ్ ఏసీ ప్రదేశంలో గాలి ఎప్పటికప్పుడు పూర్తిగా మారిపోతుంది. ఏసీ బోగీల్లో గాలి ప్రతి గంటకూ దాదాపు 12 సార్లు మారిపోతుంటుంది. ది రూఫ్ మౌంటెడ్ ఏసీ ప్యాకేజ్ యూనిట్(ఆర్‌ఎంపీయూ) సిస్టమ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఏసీ కోచ్‌లను ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఇది అత్యధిక సార్లు స్వచ్ఛమైన గాలి లోపలికి పంపిస్తుంది"
-- రైల్వే అధికారులు.
గతంలో ఆర్‌ఎంపీయూ వ్యవస్థ గంటకు 5సార్లు మాత్రమే పూర్తిగా గాలిని మార్చేసేది. కానీ, దాన్ని ఇప్పుడు మార్చారు. ప్రస్తుతం నడుపుతున్న ప్రత్యేక రైళ్లలో ప్రయాణికులెవరికీ దుప్పట్లు ఇవ్వరు. అదే విధంగా ఉష్ణోగ్రత 23 డిగ్రీల నుంచి 25 డిగ్రీల మధ్య ఉండేలా చూస్తున్నారు. భద్రమైన ప్రయాణం కోసం రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రోబోయే 7 రోజుల్లో కేటాయించిన ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేందుకు.. 1.5 లక్షల మంది టికెట్లు బుక్ చేసుకున్నట్లు తెలిపింది రైల్వేశాఖ.
రైల్వేస్టేషన్లలోనూ ఎయిర్‌పోర్టు తరహా స్క్రీనింగ్!
కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో రానున్న రోజుల్లో ప్రజా రవాణాలో స్క్రీనింగ్ వ్యవస్థ పటిష్టం కాబోతోంది. అంతేకాకుండా అంతర్జాతీయ, దేశీయ ప్రయాణాల్లో భాగంగా విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో తనిఖీ వ్యవస్థ పూర్తిస్థాయిలో మారనుంది. దీనికోసం పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు.
ఈ సందర్భంలో కేరళ ప్రభుత్వం రైల్వే స్టేషన్లలోనే విమానాశ్రయం తరహాలో స్క్రీనింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. విమానాశ్రయంలో స్క్రీనింగ్ తరహాలోనే ఇక్కడ కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని ఆ రాష్ట్ర మంత్రి సునిల్ కుమార్ వెల్లడించారు. రైలు దిగిన వెంటనే ప్రయాణికులకు స్క్రీనింగ్ చేసి పరీక్షలు నిర్వహిస్తారు. ఎవరికైనా లక్షణాలు ఉంటే రైల్వేస్టేషన్ నుంచే వారిని ఆసుపత్రికి తరలిస్తారు. లక్షణాలు లేనివారిని మాత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో వారి సొంత జిల్లాలకు తరలిస్తారు.
తాజా కేంద్ర మార్గదర్శకాల ప్రకారం రైలు ప్రయాణం చేసే ప్రతిఒక్కరికీ స్క్రీనింగ్ చేస్తారు. కేవలం లక్షణాలు లేనివారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు. లోనికి వెళ్లే మార్గంతో పాటు బయటకు వచ్చే మార్గంలో శానిటైజర్లను ఏర్పాటు చేస్తారు.