కేరళలో వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తన సొంత నియోజకవర్గం వయనాడ్ ప్రజలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. ప్రస్తుతం వయనాడ్లో వరద బాధితులను పరామర్శిస్తున్న రాహుల్.. భారీ వర్షాల కారణంగా వేలాది మంది వయనాడ్ ప్రజలు నిరాశ్రయులయ్యారని, ఇప్పటికీ సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారని తెలిపారు. వయనాడ్లో పరిస్థితి మామూలు స్థితికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రధాని నరేంద్ర మోదీలను కోరానన్నారు. వరద బీభత్సం కారణంగా నష్టపోయిన వారిని కేంద్రం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కొండచరియలు విరిగిపడి విధ్వంసం సృష్టించిన పుతుమలా ప్రాంతాన్ని సందర్శించారు రాహుల్. శిథిలాల కింద చాలా మంది చిక్కుకొని ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. వయనాడ్, కోజికోడ్ జిల్లాల్లోని సహాయక శిబిరాల్లో ఉన్న వారితోనూ రాహుల్ మాట్లాడారు. ఎవరూ భయపడొద్దని అందరికీ తగిన సహాయం చేస్తామని భరోసా ఇచ్చారు.