రష్యాలోని వ్లాదివోస్తోక్లో జరుగుతున్న తూర్పు ఆర్థిక సమాఖ్య(ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరం) వేదికగా భారత్ ప్రధాని నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశం అయ్యారు. రక్షణ, అణు కార్యక్రమం, చెన్నై, వ్లాదివోస్తోక్ మధ్య సముద్రమార్గానికి ప్రణాళికలు సహా పలు అంశాల్లో ఇరు దేశాల మధ్య అవగాహన కుదిరింది.
సమావేశం అనంతరం ఇరు దేశాల అగ్రనేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
భారత్-రష్యా మధ్య చమురు, గ్యాస్ మాత్రమే కాదు... హైడ్రోకార్బన్ సెక్టార్లో అవగాహన ఉందన్నారు మోదీ. ఈ రంగంలో సహకారం కోసం ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌పై అవగాహన కుదిరిందన్నారు. అంతరిక్షంలో ఇరుదేశాల మధ్య ఏళ్లుగా ఉన్న అవగాహన కారణంగా నూతన శిఖరాలకు చేరుకుంటున్నామన్నారు మోదీ.
"2001లో ఇరుదేశాల మధ్య పుతిన్, వాజ్‌పేయీలు మొట్టమొదటగా సమావేశం అయ్యారు. నేను గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో భారత బృందంలో సభ్యుడిగా ఉన్నాను. ఇరు దేశాల మధ్య పలు వాణిజ్య ఒప్పందాలు జరిగాయి. రక్షణ వంటి వ్యూహాత్మక విభాగంలో రష్యా సహకారంతో భారత్‌లో ఉపకరణాల తయారీకి నేడు కుదిరిన అవగాహన ఒప్పందం పరిశ్రమలకు ఊతమిస్తుంది. భారత్‌లో రష్యా సహకారంతో నిర్మిస్తున్న అణు రియాక్టర్లు ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తున్నాయి. మన దేశాల మధ్య సంబంధాలను రాజధానులకు పరిమితం చేయకుండా ఇరు దేశాల ప్రజల మధ్యకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలి. వజ్రాలు, ఖనిజాలు, వ్యవసాయం, కలప, పల్ప్, పేపర్, పర్యటకం వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య అవగాహన కుదిరింది. దేశాల మధ్య కనెక్టివిటీని పెంచేందుకు చెన్నై, వ్లాదివోస్తోక్ మధ్య సముద్రమార్గానికి యోచిస్తున్నాం."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి